చక్రాయపేట : గండి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై దేవదాయ శాఖ కమిషనర్‌కు కొందరు భక్తులు పంపిన ఫిర్యాదులపై ఆ శాఖ మల్టీజోన్ తిరుపతి ఆర్జేసీ బి.మహేశ్వరరెడ్డి శుక్రవారం విచారణ చేశారు. మహాకుంభాభిషేంలో అవకతవకలు, పంచలు, కండువాల కొనుగోలు, విద్యుత్ డెకరేషన్, షామియానాల టెండర్లలో సిండికేట్, గదుల నిర్వహణలో అక్రమాలు, అనధికారికంగా కొందరు ఉద్యోగులకు జీతాలు తదితరాలపై భక్తులు వాట్సాప్ వేదికగా కమిషనర్‌కు పంపారు. ఇందుకు స్పందించిన కమిషనర్ ఆర్జేసీ మహేశ్వరరెడ్డిని విచారణాధికారిగా పంపారు. దీంతో ఆయన గండికి చేరుకొని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన నివేదికను కమిషనర్‌కు పంపుతామని వెల్లడించారు.
అంజన్నకు పూజలు
విచారణ నిమిత్తం వచ్చిన ఆర్జేసీ గండి వీరాంజనేయస్వామిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అర్చకులు ఆయనచే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


