అ(న)ధికారిక కోతలు ! | - | Sakshi
Sakshi News home page

అ(న)ధికారిక కోతలు !

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

2వేల మెగావాట్ల విద్యుత్‌ లోటు ఏర్పడింది

పగటిపూట 9 గంటల ఉచిత

విద్యుత్‌కు కూటమి మొండిచేయి

శుక్ర, శనివారాల్లో ఏకంగా

12 గంటల పాటు కరెంట్‌ కోతలకు రంగం సిద్ధం

కడప కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎడాపెడా విద్యుత్‌ చార్జీలు పెంచేసి జనం జేబులకు చిల్లులు పెట్టింది. భారీగా భారం మోపినా కరెంటు సరఫరా అయినా సక్రమంగా ఇస్తారేమోనని ప్రజలు ఆశపడ్డారు. కానీ, తాజాగా జిల్లావ్యాప్తంగా ముందస్తు సమాచారం లేకుండా అనధికారికంగా విద్యుత్‌ కోతలు విధిస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నాలుగు రోజులుగా రాత్రి 9 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో జనం ఉక్కపోత, దోమలతో రాత్రంతా అల్లాడిపోయారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో రోజూ ఒకటి నుంచి రెండు గంటల పాటు కరెంటు నిలిపివేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు గంటల పాటు అంధకారం నెలకొంటోంది.

రైతాంగానికి తీవ్ర అన్యాయం

వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది. పగటిపూట కరెంటు ఇవ్వలేక కాడి దించేసిన సర్కారు.. ఇప్పుడు ఏకంగా మూడు నుండి నాలుగు గంటల పాటు కోతలు విధిస్తూ అన్నదాతల గొంతు కోస్తోంది. దీంతో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక బోర్ల కింద పంటలు వేసుకున్న రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కళ్లముందే పంటలు ఎండిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్నారు. భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,000 మెగావాట్ల విద్యుత్‌ లోటు ఏర్పడటం వల్లే ప్రస్తుతం అనధికారిక కరెంట్‌ కోతలు విధించాల్సి వస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా హైడల్‌ (జల విద్యుత్‌), విండ్‌ (పవన విద్యుత్‌) పవర్‌ జనరేషన్‌ ఒక్కసారిగా పడిపోవడంతో ఈ సంక్షోభం తలెత్తింది. లోటును అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, త్వరలోనే విద్యుత్‌ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుంది.

– ఎస్‌.శ్రీనివాసులు, ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement