ప్రవీణ్‌దే పైచేయి ! | - | Sakshi
Sakshi News home page

ప్రవీణ్‌దే పైచేయి !

Sep 12 2026 1:24 AM | Updated on Sep 12 2026 1:24 AM

హైకమాండ్‌ వద్ద తగ్గని పరపతి

ప్రొద్దుటూరు ఏజీపీగా

వినోద్‌కుమార్‌ నియామకం

ఎమ్మెల్యే వరద సిఫార్సు చేసిన

నిర్మలకు మొండిచేయి

ప్రవీణ్‌ సిఫార్సులకు అనుగుణంగా

ఆదేశాలు జారీ

సాక్షి ప్రతినిధి, కడప: క్షేత్రస్థాయిలో విలువ దక్కకపోయినా అధిష్టానం వద్ద పరపతి తగ్గలేదు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని కాదని, మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సిఫార్సుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రతి చిన్న విషయానికి అటు ఎమ్మెల్యే వరద ఇటు ప్రవీణ్‌కుమార్‌ పోటీ పడుతున్నారు. పైచేయి సాధించేందుకు ఎత్తులు..పైఎత్తులు వేస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్‌ పాత్ర అతిస్వల్పం అని చూపించేందుకు ఎమ్మెల్యే తనయుడు కొండారెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా అధిష్టానం వద్ద ప్రవీణ్‌కుమార్‌రెడ్డిదే అప్పర్‌ హ్యాండ్‌ అయ్యింది. ప్రొద్దుటూరు సివిల్‌ జడ్జి కోర్టు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా (ఏజీపీ) వినోద్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికలకు ముందు ప్రొద్దుటూరు ఇన్‌చిర్జిగా ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చురుగ్గా ఉండేవారు. సమీకరణల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి తెరపైకి వచ్చారు. అప్పటి వరకు కలిసికట్టుగా ఉన్నట్లు అన్పించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వరద అన్నింటా తనదే పైచేయి ఉండాలనే దిశగా అడుగులు వేశారు. ఈక్రమంలో పరస్పర దాడులు వరకు వెళ్లారు. ఎప్పటికప్పుడు ఎవరికి వారు చోటుచేసుకున్న పరిస్థితులను అధిష్టానానికి వివరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ నియామకాలపై కూడా ఎప్పటికప్పుడు ఆయా వర్గీయులు అభ్యర్థులను సిఫార్సు చేస్తూ వచ్చారు.

ఏజీపీగా వినోద్‌కుమార్‌ నియామకం...

ప్రొద్దుటూరు సివిల్‌ జడ్జి కోర్టు ఏజీపీగా అడ్వకేట్‌గా ఈ.వినోద్‌కుమార్‌ను నియమిస్తూ జీఓ ఆర్టీ నెం.259 ద్వారా సెప్టెంబర్‌ 11న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏజీపీ నియామకం కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అడ్వకేట్‌ నిర్మలను నియమించాలని సూచించారు. ఈవిషయాన్ని ఇన్‌చార్జి మంత్రి సవిత, మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు టీడీపీ మాజీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అడ్వకేట్‌ వినోద్‌కుమార్‌ను ఏజీపీగా నిమించాలని మంత్రి నారా లోకేష్‌కు విన్నవించినట్లు సమాచారం. ప్రవీణ్‌ అభ్యర్థన మేరకు సిఫార్సులు పంపాల్సిందిగా సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ కావడం, ఆమేరకు నియామకపు ఉత్తర్వులు వెలుబడినట్లు విశ్వసనీయ సమాచారం.

కొండారెడ్డి చర్యలతోనే పలుచబడ్డ పరపతి....

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అయినప్పటీకీ అనధికార పెత్తనమంతా తనయుడు నంద్యాల కొండారెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకొని కోటరీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మట్కా, గుట్కా, జూదం లాంటివి విచ్చలవిడిగా ఉన్నాయని స్వయంగా ఎమ్మెల్యే వరద బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అలాంటి వ్యక్తులనే కొండారెడ్డి ప్రోత్సహిస్తూ వారి సిఫార్సులకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు. ఇసుక అక్రమదందా, సెటిల్‌మెంట్లు ఈమారు ప్రొద్దుటూరులో సైర్వవిహారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వరద పరపతి పలుచబడినట్లు సమాచారం. ఆమేరకే ఎమ్మెల్యే సిఫార్సులను కాదనీ, ఉక్కు ప్రవీణ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏజీపీ నియామకం చోటుచేసుకున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

జీవీ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి నంద్యాల వరదరాజులరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement