ఖాజీపేట: మండలంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా, వర్షాలు లేక పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. నిత్యం జలకళతో ఉడకాల్సిన కేసీ కాలువకు నీరు రాకపోవడంతో కాలువలన్నీ ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీనివల్ల కనుచూపు మేరలో ఎటు చూసినా పొలాలన్నీ బీడు భూములుగా మారిపోయాయి. కాలువ నీరు లేకపోవడంతో కనీసం బోరుబావుల కిందైనా ఆరతడి పంటలు సాగు చేద్దామంటే.. భూగర్భ జలాలు పడిపోయి బోర్లలో నీరు చుక్క కూడా రావడం లేదు. పెట్టుబడులు పెడితే అప్పులపాలు కావాల్సి వస్తుందనే భయంతో రైతులు ఈ ఏడాది సాగుకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.


