బద్వేలు అర్బన్ : మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేసి గాయపరిచింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కృతికారెడ్డి అనే నాలుగేళ్ల చిన్నారి తన తండ్రి యల్లారెడ్డితో కలిసి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆడుకుంటోంది. ఈ సమయంలో అక్కడే సంచరిస్తున్న ఓ వీధి కుక్క ఉన్నపలంగా చిన్నారిపై దాడి చేసి గాయపరిచింది. చిన్నారి కడుపు భాగంలో గాయం కావడంతో వెంటనే చిన్నారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా చిన్నారి ఆడుకుంటున్న సమయంలో తన తండ్రి వీడియో తీస్తుండగా అదే సమయంలో చిన్నారిపై కుక్క దాడి చేసే ఘటన కూడా రికార్డు అయింది. వీధికుక్కలను నియంత్రించి ప్రజలకు రక్షణ కల్పించాలని బాధిత చిన్నారి తండ్రితో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


