ముద్దనూరు : మండలంలోని కొలవలి గ్రామానికి చెందిన రాజ(24)అనే యువకుడు చికిత్సపొందుతూ మృతిచెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సీఐ నగేష్‌బాబు సమాచారం మేరకు కొలవలికి చెందిన రాజ తన మేనత్త కూతురిని ప్రేమించాడు. అయితే రాజకు అప్పటికే పెళ్లి జరిగిందనే కారణంతో వారి వివాహానికి వారు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన రాజ ఈనెల 1వతేదీన విష ద్రావణం దాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు అతన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు.అనంతరం రిమ్స్, ఇతర ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేయించారు.చికిత్స పొందుతూ రాజ ఆదివారం మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో రైతు..
దువ్వూరు : మండలంలోని పెద్దబాకరాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పెద్దబాకరాపురం గ్రామానికి చెందిన ఆలమూరు నడిపి హుస్సేనయ్య (50) వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవాడు. ఇతనికి 1.50 ఎకరాల సొంత పొలం ఉండగా, కౌలుకు 3 ఎకరాల పొలం తీసుకుని మొక్క జొన్న పంట సాగు చేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మొక్క జొన్న పంటకు నీరు కట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మోటార్ వైర్లు తీసుకుని ట్రాన్స్‌ఫార్మర్ కొక్కీలకు తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు వైర్లు హుస్సేనయ్య కాలికి తగలడంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఉదయం 7 గంటలైనా హుస్సేనయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లి చూడగా విద్యుత్ వైర్ కాలికి తగిలి అప్పటికే హుస్సేనయ్య మృతి చెందాడని పోలీసులు తెలిపారు. హుస్సేనయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
బియ్యం వ్యాపారి అరెస్ట్
చెన్నూరు(వల్లూరు) : మండల కేంద్రమైన చెన్నూరుకు చెందిన కాటం వీర బ్రహ్మయ్య అనే అక్రమ బియ్యం వ్యాపారిని సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీర బ్రహ్మయ్య గతంలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఉండేందుకు రూ 1 లక్ష స్వీయ పూచీకత్తుతో బైండ్ ఓవర్ చేయబడ్డాడు. కానీ అతను ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు చెన్నూరు పోలీస్ స్టేషన్‌న్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బాండ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివరణ కోరుతూ చెన్నూరు తహసీల్దారు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదు. దీంతో పూచీ కత్తు సొమ్ము రూ 1 లక్ష మొత్తాన్ని జమ చేయాలని ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించలేదు. దీంతో కాటం వీర బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని కడప సెంట్రల్ జైల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
గండికోటకు కృష్ణాజలాలు నిలుపుదల
కొండాపురం : గండికోట జలాశయానికి నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ నుంచి గాలేరు– నగరి సృజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) ప్రధాన కాలువ ద్వారా వస్తున్న కృష్ణాజలాలను నిలుపుదల చేశారు. ఈ విషయాన్ని జీఎన్‌ఎస్‌ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు సోమవారం తెలిపారు.


