తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు. సోమవారం కడప మహావీర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఆత్మ గోష ర్యాలీ నిర్వహించారు. వైజాగ్‌లో సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రాయలసీమ జిల్లాలకు సంబంధించిన సచివాలయ ఉద్యోగులతో కడప వేదికగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తమ డిమాండ్లను పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది అధికారుల ఒత్తిడితో తనువు చాలించినా వారి కుటుంబాలకు ఉద్యోగం, పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కోవిడ్ సమయంలో తమ కుటుంబాలను వదిలి విధులు నిర్వర్తించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఏఎస్‌ను తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రొబెషన్ అర్హత పొందిన తొమ్మిది నెలల కాలానికి అరియర్స్ మంజూరు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి రూ. 30 వేలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓఎంఎస్ నెం. 11ను వెంటనే రద్దుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కడపజిల్లా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


