కడప అగ్రికల్చర్: ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయమే మార్గమని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్‌వి ప్రవీణ్‌కుమార్ సూచించారు. కడపలోని జిల్లా రైతు సాధికార సంస్ధ డీపీఎంయూ కార్యాలయంలో ఆదివారం రైతు మాస్టర్ ట్రైనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఖరీఫ్ పంట నమోదు ఇప్పటి వరకు 34 శాతం మాత్రమే పూర్తయిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. డివిజన్‌ల వారీగా సాగు పరిస్థితులను సమీక్షించి, ప్రాంతానుగుణంగా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. వర్షపాతం అనిశ్చితి నేపథ్యంలో ప్రతి చుక్క వర్షపు నీటిని పొలంలోనే వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు మాస్టర్ ట్రైనర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


