జమ్మలమడుగు రూరల్: అంబవరం గ్రామంలో మూడేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసింది.ఈ ఘటన ఆదివారం జరిగింది. బాలుడి తండ్రి కథనం మేరకు సాయంత్రం ఆడుకునేందుకు బాలుడు ఇంటి బయటకు వచ్చాడు. అదే సమయంలో అటు నుంచి వెళతున్న కుక్కులు దాడి చేసి నోరు, నుదురు, కణత, కాళ్లు చేతులపై కరిచాయి.స్థానికులు కుక్కలను తరమి కొట్టారని ఆయన తెలిపారు.కుక్కుల బెడద నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
సంబేపల్లె : మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన తముకు రమేశ్ (38) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు ఆదివారం సాయంత్రం ఓ పైనాన్స్ కంపెనీ వారు రమేశ్ ఇంటి వద్దకు వచ్చి పిలవగా పలకలేదు. దీంతో చుట్టుపక్కన ఉన్న వారికి, బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు తలుపులు పగలకొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వారం రోజుల కింద అమ్మగారి ఇంటికి వెళ్లింది. ఒంటరితనాన్ని భరించలేక మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వెలుగు కార్యాలయంలో
నిధుల దుర్వినియోగం
● ఎఫ్‌పీఓ సీసీకి డీఆర్‌డీఏ పీడీ నోటీసులు
గాలివీడు: మండలంలోని అగ్రికల్చర్ ఎఫ్‌పీఓ కలెక్షన్ సెంటర్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన నిధుల వినియోగంలో రూ.5,19,376 మేర అదనపు ఖర్చు జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ మొత్తాన్ని సంబంధిత ఎఫ్‌పీఓ ఖాతాల్లోకి తక్షణమే తిరిగి జమ చేయాలని అగ్రికల్చర్ ఎఫ్‌పీఓ సీసీ బాలకృష్ణకు డీఆర్‌డీఏ పీడీ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. గతంలో గాలివీడు వెలుగు కార్యాలయంలో ఏపీఎంగా విధులు నిర్వహించిన వ్యక్తి హయాంలో ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీఓ) కార్యకలాపాలకు సంబంధించిన నిధుల వినియోగం, కలెక్షన్ సెంటర్ల ఏర్పాటులో అవకతవకలు జరిగాయని ప్రస్తుత ఏపీఎం దేవసేన జిల్లా కలెక్టర్, సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. ఏపీఎం ఆధ్వర్యంలో ఎఫ్‌పీఓ అగ్రిగేటర్ నుంచి కలెక్షన్ సెంటర్ నిర్మాణం కోసం రూ.6,13,527, లైవ్‌స్టాక్ ఎఫ్‌పీఓ నుంచి రూ.5,44,850 డ్రా చేసి ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అదేవిధంగా కలెక్షన్ సెంటర్ల నిర్వహణ, వివిధ సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.3,21,526, రూ.1,97,850 చొప్పున మొత్తం రూ.5,19,376 అదనంగా ఖర్చు చేసినట్లు విచారణలో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వివరణలు పరిశీలించిన అనంతరం నిధుల వినియోగంపై బాధ్యుల నుంచి వివరణ కోరుతూ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదనంగా ఖర్చు చేసిన రూ.5,19,376 మొత్తాన్ని సంబంధిత ఎఫ్‌పీఓ ఖాతాల్లోకి తిరిగి జమ చేయాలని డీఆర్‌డీఏ పీడీ నోటీసుల్లో ఆదేశించినట్లు సమాచారం. ఎఫ్‌పీఓలకు కేటాయించిన నిధుల వినియోగంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


