కడప కోటిరెడ్డిసర్కిల్ : రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, సమాజంలో ప్రాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తున్న వైద్యులు స్వయంగా రక్తదాతలుగా ముందుకు రావడం మరింత అభినందనీయమని జేబీవీఎస్ సంస్థ వ్యవస్థాపకుడు అశోక్ తెలిపారు. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన వారోత్సవాల్లో మూడోరోజు ఆదివారం నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కడప రిమ్స్ బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తం అవసరమైన సమయంలో అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. ముఖ్యంగా వైద్యులు రక్తదానం చేయడం ద్వారా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రిమ్స్ బ్లడ్ బ్యాంక్ టెక్నికల్ సూపర్‌వైజర్ గోపిరెడ్డి విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రోగుల ప్రాణాలను కాపాడటం వైద్యుల వృత్తి, బాధ్యత అయితే, అవసరమైన వారికి రక్తం అందించడం వారి మానవతా బాధ్యత అని తెలిపారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ విద్యార్థి ప్రముఖ సాయి ఈశ్వర్ మాట్లాడుతూ రక్తదానం విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాసీ్త్రయ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎం.ఓ సభ్యులు సాయిచంద్, సాయినాథ్, మణిశంకర్, నిఖిల్, జేబీవీఎస్ సభ్యులు వీరాచారి, సూర్య, జస్వంత్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


