సరికొత్త ట్రాక్‌! | - | Sakshi
Sakshi News home page

సరికొత్త ట్రాక్‌!

Sep 6 2026 1:37 AM | Updated on Sep 6 2026 1:37 AM

సీమ అభివృద్ధికి

రాజంపేట : రాయలసీమ రవాణా రంగాన్ని సరికొత్త ప్రగతి పథంలో నడిపేందుకు ఉద్దేశించిన ముద్దనూరు–ముదిగుబ్బ–పుట్టపర్తి కొత్త రైల్వేలైన్‌ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను అధికారులు తుది రూపకల్పన చేసి రైల్వేబోర్డుకు సమర్పించారు. రూ.2,505 కోట్లతో చేపట్టనున్న ఈ నూతన రైల్వేలైన్‌ ఫైళ్లలో కదలిక ప్రారంభం కావడంతో, దశాబ్దాలుగా రైలు కూత కోసం వేచిచూస్తున్న పులివెందుల నియోజకవర్గ ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.

బెంగళూరు మెయిన్‌ లైన్‌తో అనుసంధానం

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కడప–బెంగళూరు రైలు మార్గానికి ఈ ప్రాజెక్టు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య ఉన్న 60 కిలోమీటర్ల దూరాన్ని ఆధ్యాత్మిక క్షేత్రమైన పుట్టపర్తి వరకు పొడిగించడం ద్వారా ఈ నూతన మార్గానికి రూపకల్పన చేశారు. ఈ ప్రతిపాదిత లైన్‌ ముద్దనూరు నుంచి ప్రారంభమై పులివెందుల మీదుగా సాగి, ధర్మవరం–ముదిగుబ్బ–పాకాల రైల్వేలైన్‌ను దాటుకుంటూ ముదిగుబ్బ వద్ద అనుసంధానం కానుంది. అక్కడ నుంచి పుట్టపర్తి మీదుగా సాగి, ధర్మవరం–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం–పెనుకొండ బెంగళూరు మెయిన్‌ లైన్‌లో శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం సమీపంలో కలుస్తుంది. బెంగళూరు వెళ్లేందుకు జిల్లా వాసులకు ఇది తక్కువ దూరం, త్వరితగతిన గమ్యానికి చేరుకునేందుకు వీలుంటుందని రైల్వే నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జిల్లాకు 5వ మార్గం.. ఇవే కొత్త రైల్వే స్టేషన్లు

ఉమ్మడి జిల్లాలలో ప్రస్తుతం ముంబై–రేణిగుంట మెయిన్‌లైన్‌, కృష్ణపట్నం–ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గాలు అందుబాటులో ఉండగా, కడప–బెంగళూరు రైల్వేలైన్‌ పనులు కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా ఐదో మార్గంగా కొత్త లైన్‌ అందుబాటులోకి రానుంది. మొత్తం 105.31 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ కొత్త రైలుమార్గ నిర్మాణంలో భాగంగా చిన్న దుద్యాల, మల్లెల, మడూరు, పులివెందుల, అంబకపల్లె, దొరిగల్లు, గునిపల్లె, బుచ్చయ్యగారిపల్లె స్టేషన్ల మీదుగా రైళ్లు నడవనున్నాయి. ఇప్పటికే ముదిగుబ్బ స్టేషన్‌ ఉనికిలో ఉండగా, మిగిలిన 8 చోట్ల కొత్తగా అత్యాధునిక రైల్వేస్టేషన్లు నిర్మించనున్నారు.

వైఎస్‌ జగన్‌, అవినాష్‌ రెడ్డిల కఠోర శ్రమ

పులివెందులకు రైలుకూత వినిపించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చేసిన గట్టి ప్రయత్నాల వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైంది. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి బడ్జెట్‌లో సర్వే నిధులు మంజూరు చేయించిన వీరి కృషి ఫలితంగానే నేడు సమగ్ర నివేదిక సిద్ధమైంది. ఈ రైలుమార్గం గనుక పూర్తయితే ప్రాంతీయ ఆర్థిక, సామాజిక వృద్ధి పెరగడంతో పాటు కార్మికులు, రైతులు, పేద, మధ్యతరగతి ప్రజానీకానికి సుదూర ప్రయాణాలు ఎంతో చౌకగా మరియు సులభంగా మారనున్నాయి.

రూ.2,505 కోట్ల అంచనా వ్యయంతో ముద్దనూరు–ముదిగుబ్బ–పుట్టపర్తి కొత్త రైల్వేలైన్‌ డీపీఆర్‌ సిద్ధం

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డిల కృషితో సాకారం కానున్న పులివెందుల రైలు కల

శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం సమీపంలో బెంగళూరు మెయిన్‌ లైన్‌తో అనుసంధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement