పంతుల పవన్‌కుమార్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పంతుల పవన్‌కుమార్‌ సేవలు చిరస్మరణీయం

Sep 6 2026 1:25 AM | Updated on Sep 6 2026 1:25 AM

కడప సిటీ : సీనియర్‌ జర్నలిస్టు పంతుల పవన్‌ కుమార్‌ సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. శనివారం కడపలోని ’సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం’లో పంతుల పవన్‌ కుమార్‌ సంతాప సభ నిర్వహించారు. తొలుత పవన్‌ కుమార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ మాట్లాడుతూ పవన్‌ కుమార్‌ కేవలం ఒక విలేకరి మాత్రమే కాదని, తెలుగు భాషా వికాసానికి, రాయలసీమ సాంస్కృతిక వారసత్వ రక్షణకు పోరాడిన యోధుడన్నారు. ఆయన ఆశయ సాధన కోసం, మన భాష, చరిత్ర, సంస్కృతుల పరిరక్షణకు మనమందరం పునరంకితం కావడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఇంటాక్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ లయన్‌ కే.చిన్నపరెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలోని చారిత్రక ఆధారాలు, కట్టడాల పరిరక్షణలో పవన్‌ కుమార్‌ కృషి మరవలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, సాక్షి బ్యూరో ఇన్‌చార్జి బాలకృష్ణారెడ్డి, వైవీయూ తెలుగు ఆచార్యులు డాక్టర్‌ ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పవన్‌ కుమార్‌ వార్తా రచనల్లో సమాజ శ్రేయస్సు, సాంస్కృతిక పరిమళాలు స్పష్టంగా కనిపిస్తాయని, భావితరాలకు ఆయన జీవితం మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్‌ కో–కన్వీనర్‌ పీవీ సుబ్బారెడ్డి, హౌసింగ్‌ బోర్డ్‌ కోదండరామాలయం ధర్మకర్త వెంకటరెడ్డి, పలువురు పత్రికా విలేకరులు, సాహితీప్రియులు, కవులు, సాంస్కృతిక వేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్‌కుమార్‌ సేవలను స్మరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement