కడప అర్బన్: కడప జయనగర్ కాలనీలోని ఓ ఇంటిలో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. అనిషా అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న కింద ఇంటిలో ఉదయం 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఇంటిలోని సామగ్రికి వ్యాపించాయి ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కడప అగ్నిమాపక కేంద్రం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి బి. యోగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లో నివసిస్తున్న వినుకొండ వెంకటసుబ్బయ్యకు చెందిన రిఫ్రిజిరేటర్, టీవీ, మూడు బీరువాలు, మూడు పడకలు, ఎల్‌ఐసీ పత్రాలు, విద్యా ధ్రువపత్రాలు, నగదు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా ఇంటి యజమాని మోపురి శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన మేరకు విద్యుత్ వైరింగ్, కిటికీలు, పెయింటింగ్, తలుపులు తదితరాలు దెబ్బతిన్నాయి. వీటి వల్ల సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మొత్తంగా ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.


