నిత్య పరిశోధకుడు ఆచార్య చంద్రశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

నిత్య పరిశోధకుడు ఆచార్య చంద్రశేఖర్‌

Sep 5 2026 5:31 AM | Updated on Sep 5 2026 5:31 AM

నిత్య పరిశోధకుడు ఆచార్య చంద్రశేఖర్‌ క్యాన్సర్‌ పరిశోధకురాలు డాక్టర్‌ ఎల్‌.దాక్షాయణి విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దుతున్న డాక్టర్‌ మృత్యుంజయ రావు

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ తుమ్మల చంద్రశేఖర్‌, జెనెటిక్స్‌ అండ్‌ జినోమిక్స్‌ ప్రొఫెసర్‌ లోమడ దాక్షాయణి, ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ కోట మృత్యుంజయరావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న ముగ్గురు ఆచార్యులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌, ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య పద్మతో పాటు తోటి ఆచార్యులు, సహ, సహాయ ఆచార్యులు, విద్యార్థులు అభినందించారు. కాగా, ఒకే విశ్వవిద్యాలయం నుంచి ముగ్గురు ఆచార్యులు ఒకేసారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. వీరి ప్రస్థానంపై ప్రత్యేక కథనం...

వైవీయూ పర్యావరణ శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ తుమ్మల చంద్రశేఖర్‌ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ, పీహెచ్‌డీ పట్టాలను పొందారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన వెంటనే ఆయన తైవాన్‌లోని ఐఐఎస్‌సీలో, ఆ తర్వాత దక్షిణ కొరియాలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా పరిశోధనలు చేశారు. అనంతరం యూఎస్‌ఏలో కూడా తన సేవలందించారు. ఆయన 2009లో వైవీయూ పర్యావరణ శాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. 2021లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత 2024లో ప్రొఫెసర్‌గా పదోన్నతి అందుకున్నారు. పర్యావరణ శాస్త్ర రంగంలో ఆయనకు 30 సంవత్సరాలకు పైగా పరిశోధన అనుభవం, 17 ఏళ్ల బోధనానుభవం ఉంది. ప్రతిష్ఠాత్మకమైన ‘యంగ్‌ సైంటిస్ట్‌’, ‘రామన్‌ ఫెలో’ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో ఆయన మూడుసార్లు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీటితో పాటు హాస్టల్‌ వార్డెన్‌గా, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా, ప్లేస్‌మెంట్‌ సెల్‌ సభ్యుడిగా, రూసా 2.0, పీఎం–ఉషా కార్యక్రమాలకు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ బోర్డు పరిధిలోని ఎస్‌ఈఏసీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

పరిశోధనలు ..

డాక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రధానంగా ప్లాంట్‌ బయోటెక్నాలజీ, బయోఎనర్జీ పరిశోధన రంగాల్లో కృషి చేస్తున్నారు. శైవలాలు, చేపల వ్యర్థాలను ఉపయోగించి బయోఇథనాల్‌, బయోహైడ్రోజన్‌, బయోడీజిల్‌ ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించారు. ఆయన పర్యవేక్షణలో ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తి చేయగా, ప్రస్తుతం మరో ఆరుగురు పరిశోధనలు చేస్తున్నారు. ఆయన రాసిన అనేక పరిశోధనా వ్యాసాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

వైవీయూ జెనెటిక్స్‌ అండ్‌ జినోమిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎల్‌.దాక్షాయణికి బోధన, పరిశోధన రంగాలలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఆమెకు 17 ఏళ్ల బోధనానుభవం, 26 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనానుభవం ఉంది. 2009లో వైవీయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన ఆమె, తన ప్రతిభతో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. అమెరికాలోని ప్రసిద్ధ ‘యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎండీ ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌’లో పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలోషిప్‌తో పాటు రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌గా సేవలు అందించారు.

క్యాన్సర్‌, మధుమేహంపై పరిశోధనలు

డాక్టర్‌ దాక్షాయణి ప్రధానంగా క్యాన్సర్‌ జీవశాస్త్రం, ఆటోఇమ్యూన్‌ వ్యాధులు, నానోపార్టికల్స్‌ చికిత్సాపరమైన అనువర్తనాలపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రయోగశాల క్యాన్సర్‌, ఆటోఇమ్యూన్‌ వ్యాధులు, మధుమేహం చికిత్స, నివారణ కోసం ‘బయోజెనిక్‌ సింథటిక్‌ నానోపార్టికల్స్‌’ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఆమె పరిశోధనలను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డీఎస్‌టీ, డీబీటీ, సీఎస్‌ఐఆర్‌, యూజీసీ, ఎస్‌ఈఆర్‌బీ, రూసా, ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ వంటి జాతీయ సంస్థల నుంచి రూ.2.45 కోట్ల పరిశోధన నిధులను మంజూరుచేశారు. ఆమె రాసిన 45 పరిశోధనా వ్యాసాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జర్నల్స్‌లో (సెల్‌ హోస్ట్‌–మైక్రోబ్‌, పీఎల్‌ఓఎస్‌ జెనెటిక్స్‌, క్యాన్సర్‌ రీసెర్చ్‌) ప్రచురితమయ్యాయి.

అందుకున్న పురస్కారాలు

డీఎస్‌టీ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు (2011), యూఎస్‌ఏలో పరిశోధనల కోసం రామన్‌ ఫెలోషిప్‌ (2014–15),ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ఫెలోషిప్‌ (2019), అత్యుత్తమ విద్యావేత– పండితురాలు అవార్డు (2023), మానవతా మెరిటోరియస్‌ టీచర్‌ అవార్డు (2025) ఆమె సొంతం చేసుకున్నారు.

వైవీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ కోట మృత్యుంజయ రావు రాయలసీమతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులను ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దడంలో అలుపెరుగని కృషి చేస్తున్నారు. గత 17 ఏళ్లుగా వైవీయూలో బోధన, పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సును ప్రారంభించి, రాయలసీమ కళారంగానికి గుర్తింపు తెచ్చారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ప్రత్యేకంగా రాయలసీమ లోని ఆలయాల వాస్తు, శిల్పకళ, చిత్రకళలపై విస్తృత పరిశోధనలు చేశారు. ఈ అంశాలపై ఇప్పటివరకు 6 పుస్తకాలను రచించగా, దాదాపు 70 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ప్రస్తుతం పలువురు పరిశోధక విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరిస్తున్నారు.

కడపను దేశ పటంలో నిలిపి..

జాతీయ స్థాయిలో లలిత కళా అకాడమీ, నాగపూర్‌లోని సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కల్చరల్‌ సెంటర్‌, మద్రాస్‌ రీజనల్‌ సెంటర్‌ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించి కడపను దేశ సాంస్కృతిక పటంపై సగర్వంగా నిలబెట్టారు. ముఖ్యంగా ‘చదువుకుంటూనే సంపాదన’ దక్కేలా కోర్సు పాఠ్యప్రణాళికను రూపొందించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.

సామాజిక సేవ: ఇన్‌టాక్‌ సభ్యుడిగా, రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ సంయుక్త కార్యదర్శిగా, బాలోత్సవం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పర్యాటక రంగాన్ని, స్థానిక హస్తకళలను ప్రోత్సహిస్తూ తనదైన సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. విశ్వవిద్యాలయంలో ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేసి, నడిపిస్తూ భావితరాలకు చిత్రకళపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈయన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి పర్యాటక రంగ అవార్డు (2025), ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ నుండి ‘బెస్ట్‌ రీసెర్చ్‌ పేపర్‌’ అవార్డు (2026), మానవతా ఫౌండేషన్‌ నుండి ‘ఉత్తమ టీచర్‌ అవార్డు’, మచిలీపట్నం ఆర్ట్‌ అకాడమీ నుండి ‘దామె ర్ల రామారావు స్మారక పురస్కారం’ లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement