● ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన రమణారెడ్డి | - | Sakshi
Sakshi News home page

● ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన రమణారెడ్డి

Sep 5 2026 5:31 AM | Updated on Sep 5 2026 5:31 AM

● ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన రమణారెడ్డి

రమణారెడ్డి ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్‌, నాటి సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటూ..

కడప ఎడ్యుకేషన్‌: కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన గానుగపెంట రమణారెడ్డి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివిన ఆయన, 1998లో ఎస్జీటీగా ఎంపికై కవలకుంట్ల యూపీ పాఠశాలలో ప్రస్థానం ప్రారంభించారు. సుదీర్ఘ బోధనా ప్రస్థానంలో పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ తనదైన ముద్ర వేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

బడి రూపురేఖలు మారుస్తూ..

కవలకుంట్ల బడిలో విద్యార్థుల సంఖ్యను 70 నుంచి 200కు పెంచి, దానిని జెడ్పీ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేయించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నా ఆయనే 10వ తరగతి వరకు బోధించేవారు. 2002లో పులివీడు బడిలో పిల్లల సంఖ్యను 60 నుండి 100కు పెంచి యూపీ స్కూల్‌గా మార్చారు. 2009లో ఉప్పలూరు పాఠశాలలో విద్యార్థులను 18 నుండి 54కు పెంచినందుకు 2016లో ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డు అందుకున్నారు. 2017లో పిట్టిగుంట బడిలో కేవలం ముగ్గురు పిల్లలుండి మూతపడే స్థితికి చేరగా, ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించి ఆ సంఖ్యను 103కు పెంచారు. ఈ అంకితభావాన్ని ఆనాటి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

సొంత నిధులు, దాతల సహకారం..

పిట్టిగుంట పాఠశాల అభివృద్ధికి రమణారెడ్డి రూ.2.50 లక్షల సొంత నిధులు ఖర్చు చేయడంతో పాటు, రెండేళ్ల పాటు సొంత డబ్బుతో వాలంటీర్‌ను నియమించారు. దాతల సహకారంతో రూ.10 లక్షలు సేకరించి సొంత స్థలం, టాయిలెట్లు సమకూర్చారు. ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న కరణంవారిపల్లె పాఠశాలలోనూ రూ.1.50 లక్షల సొంత ఖర్చుతో వాలంటీర్‌ను, ప్రింటర్‌ను ఏర్పాటు చేశారు. దాతలు, సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ సాయంతో రూ.7 లక్షలు సేకరించి ప్రహారీ గోడ, డిజిటల్‌ బోర్డు, కంప్యూటర్‌ వంటి సదుపాయాలు కల్పించారు. ఈ సేవలకు 2022లో ఆయన ప్రతిష్ఠాత్మక ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డును అందుకున్నారు.

హృదయంతరంగాలు

ఆయన వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు నేడు దేశ విదేశాలలో ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ‘సార్‌ ఇచ్చిన అద్భుతమైన మోటివేషన్‌ వల్లే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను’ అని ఆక్టోపస్‌ కమాండో వెంకటేశ్వర్లు తెలపగా, ‘సార్‌ కల్పించిన చదువు పట్ల ఆసక్తి వల్లే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డాను, ఆయన రుణం తీర్చుకోలేము’ అని బెంగళూరు హెచ్‌సీఎల్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శశిధర్‌ కృతజ్ఞత చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement