‘మా సార్ జగదీశ్వరయ్య అంటే నాకు చదువు చెప్పిన గురువు మాత్రమే కాదు.. నా పాలిట ప్రత్యక్ష దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం.. అందరినీ ఒకే రూపంలో చూడాలనుకుంటే మా సార్‌ను చూస్తే సరిపోతుంది’ అంటూ తన గురువు పట్ల ఉన్న భక్తిని చాటుకున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గం, సోమలవారిపల్లెకు చెందిన సచివాలయ వీఆర్వో మల్లికార్జున్. ‘నేను 5వ తరగతి చదువుతుండగా మా అమ్మ చనిపోయింది. ఆ కష్టకాలంలో చదువు మానేసి నాన్నతో కలిసి పనులకు వెళ్తుంటే, బలపనూరు జెడ్పీ హైస్కూల్ పీఈటీగా ఉన్న జగదీశ్వరయ్య సార్ మా ఇంటికి వచ్చి నన్ను మళ్లీ బడికి వచ్చేలా చేశారు. 10వ తరగతి తర్వాత సార్ ఇచ్చిన స్ఫూర్తితోనే పులివెందుల లయోలా కళాశాలలో పాలిటెక్నిక్ ఫ్రీ సీట్ సాధించాను. పాలిటెక్నిక్ పూర్తయ్యాక కర్నూలు పుల్లారెడ్డి కాలేజీలో బీటెక్ సీట్ వచ్చింది. తీరా చేరాక మా నాన్న కూడా చనిపోవడంతో హాస్టల్ ఫీజు కట్టలేక చదువు ఆపేయాలనుకున్నాను. విషయం తెలిసి మా సార్ మళ్లీ దేవుడిలా వచ్చి.. ‘నేనున్నాను చదువుకో’ అని ధైర్యం చెప్పారు. ఆపై సార్ అండతోనే తిరుపతి ఎస్వీయూలో సివిల్ ఇంజనీరింగ్ ఎంటెక్ పూర్తి చేశాను. ఎంటెక్ చదువుతుండగానే నాకు గ్రామ సచివాలయంలో వీఆర్వో ఉద్యోగం వచ్చింది. సార్ సలహాతో ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ఎంటెక్ పూర్తి చేశాను. మా సార్ భార్య (నా దృష్టిలో ఆమె నా కన్నతల్లి) ప్రతి నెల ఒకటి రాగానే.. ‘మల్లికి డబ్బులు వేశావా?’ అని సార్‌ను అడిగి మరీ వేయించేవారు. అలా ఆ దంపతులిద్దరూ కలిసి నాకు ఈరోజు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చారు.మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వారు వచ్చి నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు.’ అంటూ వీఆర్వో మల్లికార్జున్ కన్నీటిపర్యంతమయ్యారు.
‘మా పిల్లల్లో ఒకడు’ అనుకున్నాం : జగదీశ్వరయ్య
‘నేను బదిలీపై పులివెందుల బలపనూరు జెడ్పీ హైస్కూల్‌కు వెళ్లినప్పుడు అది ఆటలు తెలియని ఒక మారుమూల పాఠశాల. ప్రార్థన సమయానికి రాని పిల్లల కోసం స్వయంగా పల్లెలకు వెళ్లి వారిని బడికి తెచ్చి ఆటలు ఆడిస్తుండేవాడిని. అలా మల్లికార్జున్‌లో ఉన్న క్రీడా ప్రావీణ్యాన్ని గుర్తించి బాల్ బ్యాడ్మింటన్ నేర్పాను. అయితే వాడు చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో చదువు ఆపేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని నా భార్యతో చర్చించగా.. వాడి చదువుకు కావాల్సిన ఏర్పాట్లు మనమే చేద్దామంది. ‘మా పిల్లల్లో ఒకడు‘ అని మేమిద్దరం అనుకున్నాము. ఈరోజు ఆ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించి గౌరవప్రదంగా కొత్త జీవితాన్ని సాగిస్తుంటే ఒక గురువుగా నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.’ –రాయచోటి టౌన్


