ముగ్గురు టీచర్లకు రాష్ట్ర ఉత్తమ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు టీచర్లకు రాష్ట్ర ఉత్తమ అవార్డులు

Sep 4 2026 1:24 AM | Updated on Sep 4 2026 1:24 AM

జిల్లావ్యాప్తంగా ఒక హెడ్‌మాస్టర్‌, ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్లు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో కడప గాంధీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు పి.నాగమణి, ప్రొద్దుటూరు ఎస్‌పీసీఎన్‌ ఎంపీఎల్‌ హైస్కూల్‌ స్కూల్‌ అసిసెంట్‌ జి.గంగాధరనాయుడు, సికెదిన్నె మండలం మూలవంక జెడ్పీ హైస్కూల్‌(ఉర్దూ) టీచర్‌ షేక్‌ అబ్థుల్‌ సత్తార్‌లున్నారు. వీరు ఈ నెల 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోనున్నారు. – కడప ఎడ్యుకేషన్‌/ప్రొద్దుటూరు కల్చరల్‌

చదివిన స్కూల్‌కే హెచ్‌ఎం

ఎనిమిదేళ్ల సర్వీస్‌లో సెలవెరుగని హెచ్‌ఎం

తెలుగు మాస్టారుకు దక్కిన గౌరవం

దీక్షా యాప్‌లో 100కు పైగా వీడియో పాఠాలు

కడప నగరానికి చెందిన ప్రముఖ ఉర్దూ ఉపాధ్యాయుడు ఎస్‌.అబ్దుల్‌ సత్తార్‌ ఫైజీ ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 1989లో లక్కిరెడ్డిపల్లెలో ఎస్జీటీగా ప్రస్థానం ప్రారంభించి, సీకే దిన్నె, రాజంపేట, మైదుకూరులలో పనిచేసి, ప్రస్తుతం మూలవంక జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉర్దూగా సేవలందిస్తున్నారు. తరగతి గది బోధనతో పాటు సాహిత్య, నాటక, సామాజిక రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను ఈ పురస్కారం దక్కింది.

సాహిత్య, రచనా ప్రస్థానం

సత్తార్‌ ఫైజీ 1996 నుండి 2026 వరకు నిరంతరాయంగా 12 ఉర్దూ, 4 తెలుగు పుస్తకాలను రచించారు. ఇందులో శ్రీసర్వరే కౌనైన్‌శ్రీ భక్తిగేయాలు, శ్రీషాహే ఉమ్మత్‌శ్రీ కవితలు, శ్రీధనక్‌శ్రీ బాలసాహిత్యం, శ్రీగుల్‌హాయే ఆఖీదత్‌శ్రీ గ్రంథాలు ప్రముఖమైనవి. బహుభాషా కవిగా 1,000కు పైగా కవిసమ్మేళనాల్లో పాల్గొని, 400 ఉర్దూ, 150 తెలుగు వ్యాసాలు రాశారు. 33 చారిత్రక, సాంఘిక హాస్య నాటకాలు రచించడంతో పాటు ఎస్సీఈఆర్టీ టెక్స్‌ట్‌బుక్‌ రైటర్‌గా, ఉపాధ్యాయ శిక్షణలో రీసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించారు.

సామాజిక బాధ్యత – పురస్కారాలు

జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడిగా, కడప బాలోత్సవం సలహాదారుగా, రాయలసీమ ఉర్దూ రైటర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా వివిధ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 35 ఏళ్ల సేవలో 200కు పైగా సన్మానాలు అందుకున్న ఆయనను మిర్జా గాలిబ్‌ అవార్డు (2003), జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2005), ఉర్దూ అకాడమీ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, సితార–ఎ–ఉర్దూ అవార్డు (2023), నేషనల్‌ అల్లామా ఇక్బాల్‌ అవార్డు (2024), ఏపీ ఉర్దూ అకాడమీ బెస్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు (2025) వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి.

నాగమణి

ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందిన ఎనిమిదేళ్ల సర్వీస్‌లో ఏనాడూ పాఠశాలకు సాధారణ సెలవు పెట్టలేదు. అంతటి నిబద్ధతతో పనిచేస్తూ, తాను చదివిన పాఠశాలకే హెచ్‌ఎంగా వచ్చి విద్యా ప్రమాణాలను పెంచిన కడప గాంధీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం పెనువాడి నాగమణి ఈ ఏడాది ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’కు ఎంపికయ్యారు. ఆమె హయాంలో పదో తరగతి ఫలితాలు 61 శాతం నుండి 75 శాతానికి పెరగడమే కాక, బడిలో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కడపకు చెందిన పెనువాడి నాగేశ్వరావు (హెడ్‌ కానిస్టేబుల్‌), సాలమ్మల కుమార్తె అయిన నాగమణి, కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, ఎంఏ పూర్తి చేసి, కడప రాజేశ్వరి కళాశాలలో బీఈడీ పట్టా పొందారు. ఆమె భర్త పుల్లయ్య సామాజిక వేత్త కాగా, పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. రెండో కుమారుడు యశ్వంత్‌ బీటెక్‌ మూడోసంవత్సరం చదువుతున్నారు.

ఉద్యోగ ప్రస్థానం: నాగమణి 2000 నవంబర్‌ 13న ఎస్జీటీగా కడప 16వ వార్డు ఎంసీహెచ్‌ఎస్‌లో ఉద్యోగంలో చేరి 12 ఏళ్లు పనిచేశారు. 2012 మే 17న స్కూల్‌ అసిస్టెంట్‌గా గాంధీనగర్‌ ము న్సిపల్‌ హైస్కూల్‌కు వెళ్లారు. ఆపై 2017 సెప్టెంబర్‌ 14న హెచ్‌ఎంగా పదోన్నతి పొంది, తాను చదివిన మున్సిపల్‌ హైస్కూల్‌ (మెయిన్‌)లోనే ఏడేళ్ల పాటు ఆదర్శవంతంగా సేవలు అందించారు. 2025 జూన్‌ 1వ తేదీన బదిలీపై ప్రస్తుత గాంధీనగర్‌ హైస్కూల్‌కు హెచ్‌ఎంగా వచ్చారు.

గంగాధర్‌ నాయకుడు

ప్రొద్దుటూరు కల్చరల్‌: రామేశ్వరంలోని ఎస్‌పీసీఎన్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ తెలుగు ఉపాధ్యాయుడు గంగాధర్‌ నాయుడు పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో బోధిస్తే విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారనే భావనతో పాఠ్యాంశాలను వినూత్న చిత్రాలతో అర్థమయ్యేలా వివరిస్తూ గుర్తింపు పొందారు.

దీక్షా యాప్‌లో వంద వీడియోలు.. యూట్యూబ్‌ బోధన

తన డిజిటల్‌ బోధన రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉపయోగపడాలనే ఆశయంతో యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పాఠాలు చెప్తున్నారు. ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన అధికారిక ‘దీక్షా’ యాప్‌లో వందకు పైగా వీడియోలను పొందుపరిచారు. 7, 10వ తరగతి పాఠ్యపుస్తకాల రచనలో సాంకేతిక నిపుణుడిగా వ్యవహరించి, బుక్స్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడంపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు.. వందకు వంద మార్కులు

ఉపాధ్యాయ శిక్షణలో రాష్ట్ర, జిల్లా రీసోర్స్‌ పర్సన్‌గా, డీసీఈబీ మెటీరియల్‌ రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 2018లో ఢిల్లీలో జరిగిన ఐసీటీ సెమినార్‌లో ప్రదర్శన ఇచ్చారు. బోధనా నైపుణ్యంతో 2024–25లో వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో, 2025–26లో రామేశ్వరం ఎస్‌పీసీఎన్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఆరుగురు చొప్పున 100కు 100 మార్కులు సాధించారు. గత 26 ఏళ్లుగా ఉత్తమ ఫలితాల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, తనకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని గంగాధర్‌ నాయుడు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement