రాజంపేట: పదవకవితపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్ధలిలో వెలసిన శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను గురువారం ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పవిత్రోత్సవాలలో భాగంగా తొలిరోజు పవిత్ర మాలల సంపూర్ణ కార్యక్రమంలో సిద్దేశ్వరస్వామికి నిర్వహించారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, వేదపండితులు, టీటీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి: కడప సబ్ జైలు (సెంట్రల్ జైలు పరిధి) నుండి పరారైన రిమాండ్ ఖైదీని తిరుపతి ఈస్ట్ పోలీసులు పట్టుకుని రాయచోటి పోలీసులకు అప్పగించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి దొంగతనం కేసులో నిందితుడిగా ఉంటూ కడప జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. కాగా, మరో దొంగతనం కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై పోలీసులు ఇతడిని రాయచోటి కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు విచారణ అనంతరం నిందితుడిని తిరిగి కడపకు తరలించి, జైలు లోపలికి తీసుకెళ్తున్న క్రమంలో పోలీసుల కళ్లు గప్పి వీరారెడ్డి తప్పించుకుని పారిపోయాడు. అక్కడ నుండి తిరుపతికి చేరుకున్న ఇతడిని తిరుపతి ఈస్ట్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే రాయచోటి పోలీసులకు సమాచారం అందించగా.. ఏఎస్‌ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ అయాన్ బాషా, హోంగార్డు మధుబాబులు తిరుపతికి వెళ్లి వీరారెడ్డిని తమ ఆధీనంలోకి తీసుకుని తిరిగి కడప జైలుకు తరలించారు.


