– మరో టీచర్‌కు షోకాజ్ నోటీస్
కడప ఎడ్యుకేషన్: కడప మండల పరిధిలోని చెమ్ముమియపేట మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగన్నను డీఈఓ సస్పెండ్ చేయగా, ఆదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయురాలు సుబ్బమ్మకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. హెడ్‌మాస్టర్ నాగ న్న విద్యార్థినులతో అభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. ఆదే విధంగా ఎస్‌జీటీ సుబ్బమ్మ తన భర్తను పాఠశాలకు పిలిపించి పిల్లలను మందలించడంపై వచ్చిన ఆరోపణలపై నోటీసు ఇచ్చినట్లు, ఎనిమిది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ
కడప కార్పొరేషన్: ఏపీ ట్రాన్స్‌కో కడప జోన్ చీఫ్ ఇంజినీర్‌గా కె.కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం శంకరాపురంలోని ఏపీ ట్రాన్స్‌కో నిలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీకే వీరభద్రయ్య శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.నూతన సీఈ కరుణాకర్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు పగటిపూట నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా విద్యుత్ లైన్లకు అంతరాయం ఏర్పడితే తక్షణమే మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే పారిశ్రామిక వాడలకు ఎక్కడా కరెంట్ కోతలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈలు శ్రీనివాసులరెడ్డి, చౌడయ్య, డీఈఈలు రామమోహన్, ప్రసాద్‌రెడ్డి, ఏఈలు మౌనిక, ఎ.మౌనిక తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీలో చోటు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నెల్లూరులో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు జరిగిన డీవైఎఫ్‌ఐ 16వ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో వైఎస్సార్ జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వీరణాల శివకుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ముడియం చిన్ని ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని, ఖాళీ పోస్టుల భర్తీతో పాటు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల కోసం సేకరిస్తున్న వేలాది ఎకరాల భూముల్లో స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించేలా యువతను చైతన్యపరచి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
వీరణాల శివకుమార్ ముడియం చిన్ని


