● గుర్తింపు సంఖ్యతోనే ప్రభుత్వ పథకాలు
● త్వరితగతిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
● సొంత భూమి ఉన్న రైతుకు
ఆధార్ తరహాలో 11 అంకెల నెంబర్
కడప అగ్రికల్చర్: అన్నదాతలకు అండగా నిలవాలని ప్రభుత్వాలు సంకల్పించాయి. రైతులకు లభించే అన్ని రకాల సేవలను, ప్రభుత్వ సాయాన్ని ఒకే చోట అందించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా సాధారణ పౌరులకు ఉండే ఆధార్‌కార్డు మాదిరిగానే, కర్షకులకు కూడా పదకొండు అంకెలు కలిగిన ‘యూనిక్ ఐడీ’ నెంబర్‌తో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ముమ్మరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పత్రం జారీ చేసే ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో (ఆర్‌బీకే) నమోదు ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. జిల్లా మొత్తం మీద 3 లక్షలకు పైగా రైతులు ఉండగా, వీరిలో పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారు 2,86,983 మంది ఉన్నారు. ఎనిమిది వ్యవసాయ డివిజన్ల పరిధిలో ఇప్పటివరకు 2,38,090 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇంకా 48,771 మంది రైతులు ఈ నమోదు ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు.
నమోదుకు అడ్డంగా రెవెన్యూ సమస్యలు
ఫార్మర్ రిజిస్ట్రీ యాప్‌లో నమోదు కాని వారిలో చాలామంది రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్నారు. వారసత్వంగా సంక్రమించిన భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించకపోవడం, పట్టాదారు పాసు పుస్తకాలు, 1బీ, అడంగల్‌లలో ఇంకా పూర్వీకుల పేర్లే ఉండటం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీనితో పాటు భూమి అసలు యజమాని ఒకరైతే, మరొకరి పేరిట వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదు కావడం వంటి లోపాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సాంకేతిక, రెవెన్యూ సమస్యల వల్లే వేలాది మంది రైతులు విశిష్ట సంఖ్యను పొందలేక ఆందోళన చెందుతున్నారు.
నమోదుకు అవసరమైన ధ్రువ పత్రాలు
జిల్లాలో రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడానికి రైతు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ (పాసు పుస్తకం లేనిచో వన్‌బీ), ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను వెంటతీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ సిబ్బంది వివరాలు నమోదు చేయగానే రైతు మొబైల్‌కు మూడు ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలను వ్యవసాయ సిబ్బందికి తెలియజేసి కన్ఫర్మ్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ యూనిక్ ఐడీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి రైతు తప్పనిసరిగా ఈ విశిష్ట ఐడీని పొందాలి. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల వ్యవసాయ సేవలు, సంక్షేమ పథకాలు ఈ ఐడీ కార్డు ద్వారానే లభిస్తాయి. ఇప్పటికే జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో (ఆర్‌బీకే) రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,090 మంది రైతులు ఫార్మర్ ఐడీ కోసం విజయవంతంగా నమోదు చేసుకున్నారు. ఇంకా చేసుకోని రైతులు ఎవరైనా ఉంటే, వెంటనే తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం.
– మట్టా సుబ్రమణేశ్వరావు,
జిల్లా వ్యవసాయ అధికారి


