కడప రూరల్ : సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ బలపనూరు శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పీఆర్సీ కమిటీని వెంటనే వేయాలన్నారు . ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ తక్షణమే ప్రకటించాలని తెలిపారు. రావాల్సిన 5 డీఏ లను మంజూరు చేయాలని చెప్పారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా జేఏసీ సెక్రటరీ జనరల్ మహేష్ బాబు, జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సైలేశ్వరరెడ్డి, యూటీఎఫ్ నాయకులు ఇలియాస్, జిల్లా ఎన్జీవోస్ సెక్రటరీ నిత్యపూజయ్య, ఎన్జీవోస్ నాయకులు టి.శ్రీనివాసులు, తిమ్మారెడ్డి, బాలపుల్లయ్య, సిద్దయ్య, పద్మనాభరావు, మహిళా విభాగం కృష్ణ కుమారి, సునీత తదితరులు పాల్గొన్నారు.
హక్కుల కోసం గర్జించిన ప్రభుత్వ వైద్యులు
కడప అర్బన్ : ప్రభుత్వ వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జీడీఏఏపీ ఆధ్వర్యంలో జీఎంసీ కడప వైద్యులు గురువారం ఆందోళన చేపట్టారు.ఓపీడీ బ్లాక్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు.‘వైద్యులకు న్యాయం చేయాలి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి’అంటూ నినాదాలు చేశారు. 2016 నుంచి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న బోధనా వైద్యుల వేతన/పే రివిజన్ బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రమోషన్లు,ఎన్‌పీపీఏ, క్యాడర్ సమస్యలు, ఖాళీల భర్తీ తదితర న్యాయబద్ధ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆందోళన అనంతరం వైద్యులు తమ సమ్మె నోటీసు లేఖలను జీఎంసీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ బోధనా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సమర్పించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే దశలవారీగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని జీడీఏఏపీ ప్రకటించింది. సెప్టెంబరు 7 నుంచి మధ్యాహ్నం ఓపీలు, సెప్టెంబరు 21 నుంచి ఓపీడీలు, ఎలక్టివ్ సర్జరీల బహిష్కరణ, రిలే నిరాహార దీక్షలు, సెప్టెంబరు 28 నుంచి నిరాహార దీక్ష వంటి కార్యక్రమాలు ఉంటాయని నోటీసులో పేర్కొంది. రోగుల భద్రత, అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని జీడీఏఏపీ ప్రతినిధులు తెలిపారు.


