మైలవరం : మండల పరిధిలోని ధన్నవాడ గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం జలప్రవేశం చేసే కార్యక్రమంలో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం బుధవారం నెలకొంది. గతనెల 28, 29వ తేదీలలో గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి 30వ తేదీన విగ్రహ ప్రతిష్టను గ్రామస్తులందరూ కలిసి చేశారు. అయితే గ్రామంలో పాత విగ్రహాన్ని ఏమిచేయాలో అన్న విషయాన్ని కమిటీ పెద్దలు బ్రాహ్మణ పెద్దలతో చర్చించారు. వారి సలహా మేరకు పాత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జలప్రవేశం చేయించాలని తెలుపడంతో ఆ మేరకు విగ్రహాన్ని మైలవరం జలాశయంలో జలప్రవేశం చేయించటానికి సిద్ధమయ్యారు. అయితే ఇంకో వర్గం మాత్రం గ్రామంలోనే ప్రతిష్టించాలని పదేపదే అడ్డుతగులుతూ వచ్చారు. అయితే మంగళవారం రాత్రి పాత విగ్రహాన్ని జలప్రవేశం చేయబోతున్నట్లు గ్రామంలో దండోర వేయించారు. దీంతో రాత్రి 10గంటల సమయంలో నూతన దేవాలయం భజన జరుగుతుండగా మరో వర్గానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్టించాలని మీరు అవసరంలేకపోతే మా దేవాలయంలో ప్రతిష్టిస్తామంటూ వాదనకు దిగారు. దీంతో కమిటీ సభ్యులు ఒకరిపై ఒకరు వాదనకు దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బుధవారం ఉదయమే బందో బస్తు మధ్యలో పాత విగ్రహాన్ని మైలవరం జలాశయంలో జలప్రవేశం చేయించారు. అయితే గత రాత్రి జరిగిన వాదులాట వల్ల ఇరువర్గాలకు సంబంధించిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హైమావతి తెలిపారు.
పెన్నానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు శివారులోని రామేశ్వరం గంగమ్మ ఆలయం వెనుక పెన్నానది నీటి కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం రూరల్ పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని ఎస్‌ఐ తెలిపారు. అతను రెండు, మూడు రోజుల క్రితం నీటిలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
మృతదేహంతో పశువైద్యశాల వద్ద ఆందోళన
మైదుకూరు : ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సింగయ్యగారి వెంకటసురేష్ మృతదేహంతో బుధవారం ఆయన బంధువులు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాల వద్ద ఆందోళన చేశారు. పశువైద్యశాలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకట సురేష్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం పోస్టుమార్టం అయిపోగానే ఆయన మృతదేహాన్ని స్థానిక పశువైద్యశాల వద్దకు తీసుకుని వచ్చి బంధువులు ఆందోళన చేశారు. వెంకట సురేష్‌ను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతామని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ సుమన్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
నకిలీ పోలీసుల అవతారంలో బెదిరింపులు
ప్రొద్దుటూరు క్రైం : పోలీసులమని చెప్పి యువత, ప్రేమ జంటలను బెదిరించి డబ్బు లు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంటరిగా కూర్చున్న యువత, ప్రేమ జంటలను గుర్తించి తాము పోలీసులమంటూ బెదిరించి వారి నుంచి నిందితులు డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలో నవీన్‌కుమార్ అనే వ్యక్తిని బెదిరించి రూ.1.35 లక్షలు విలువ చేసే ఐఫోన్‌ను తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. నిందితుల నుంచి పైబర్ లాఠీ, పల్సర్ బైక్, రూ.1.35 లక్షలు విలువైన ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు రూరల్ ఎస్‌ఐ రాజు తెలిపారు.
● అభయాంజనేయ స్వామి విగ్రహ విషయంలో వివాదం
● ఇరువర్గాలపై కేసు నమోదు
ఇరువురి అరెస్ట్


