కడప సెవెన్‌రోడ్స్ : ఆస్పిరేషనల్ జిల్లా కార్యక్రమం (ఏడీపీ), ఆస్పిరేషనల్ బ్లాక్స్ కార్యక్రమం (ఏబీపీ) అమలును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు శుక్రవారం కడప జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ‘నీతి తార (టూల్‌కిట్ ఫర్ అనాలసిస్ రివ్యూ అండ్ యాక్షన్)పై జిల్లా స్థాయి సామర్థ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ హజరతయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రణాళికల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సమీక్షలు, ఆధారపూర్వక నిర్ణయాల కోసం నీతి తార వేదికను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి శాఖ తమ రోజువారీ సమీక్షల్లో ఈ వేదికను భాగం చేసుకుని పరిపాలనను మరింత ఫలవంతంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఎడ్‌సీఐఎల్ (ఇండియా) లిమిటెడ్‌కు చెందిన మాస్టర్ ట్రైనర్ నర్సింగ్ దాస్ శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయి అధికారులు, సీకే దిన్నె, జమ్మలమడుగు ఆస్పిరేషనల్ బ్లాక్‌ల ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులకు మెరుగైన,
సత్వర సేవలు
– ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ
శివశంకర్ లోతేటి వెల్లడి
కడప కార్పొరేషన్: వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలందించేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రైతులు వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు దరఖాస్తు చేసి, మెటీరియల్, పనుల నిర్వహణ కోసం నగదును చెల్లించినప్పటి నుంచి విద్యుత్ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని అరికట్టడంతోపాటు నిబంధనల ఉల్లంఘనకు అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరులో పారదర్శకతను పెంపొందించడంతోపాటు రైతులకు సకాలంలో సర్వీసులను మంజూరు చేయాలని పలు సంస్కరణలను చేపడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఏపీఎస్‌పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా రైతులు వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తు సీనియారిటీని తెలుసుకునే సదుపాయాన్ని కల్పించామని తెలిపారు.
27 నుంచి టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
– డీఈఓ షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్: ఇటీవల జరిగిన టెక్నికల టీచర్ సర్టిఫికెట్ కోర్సు (టీటీసీ–2026) శిక్షణ కార్యక్రమానికి హాజరయిన అభ్యర్థులకు, గత సంవత్సరంలో శిక్షణ పూర్తి చేసుకుని ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి థియరీ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సంబంధిత పరీక్షలు కడపలోని గాంధీనగర్ మున్సిపల్ స్కూల్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మూడు పేపర్‌లుగా జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సిద్దం కావాలని తెలిపారు. పరీక్షల టైమ్ టేబుల్ వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
‘మిల్లెట్స్‌తో..
స్వయం ఉపాధి’పై శిక్షణ
కడప అగ్రికల్చర్: కడప కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నాబార్జు ప్రాజెక్టు కింద సెల్ఫ్ క్రాప్‌టెడ్ కెరీర్ విత్ మిల్లేట్స్ అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా మిల్లెట్స్ పరిచయం, వివిధ రకాల మిల్లెట్స్ వాటి సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. అలాగే అంగ్రూలో అభివృద్ధి చేసిన మిల్లెట్ రకాలు, బయోఫోర్టిఫైడ్ (పోషక విలువలు పెంచిన) మిల్లెట్ రకాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అనంతరం మిల్లెట్స్‌తో తయారు చేసే సాంప్రదాయ ఆహార పదార్థాల తయారీలో ప్రాక్టికల్ హ్యాండ్స్–ఆన్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు టి. మహేష్, సాయి మహేశ్వరి, మిస్ జంబావి, రీసెర్చ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.


