కడప అగ్రికల్చర్/రాజుపాళెం: వరుణుడి రాక కోసం నింగికేసి చూస్తున్న రైతులకు ప్రస్తుతం కురుస్తున్న మోస్తరు వర్షాలు ఊరటనిచ్చాయి. గతంలో అరకొర పదునులో సాగు చేసిన పత్తి, మినుము, పసుపు, మెక్కజొన్న, మిరప పంటలకు వాన జల్లులు కాసింత ఊపిరి పోశాయి. జిల్లావ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతల్లో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. చాలా మంది రైతులు ఆరుతడి పంటలైన కంది, వేరుశనగ, జొన్నతోపాటు పలు రకాల పంటల సాగుకు సమాయత్తం అవుతున్నారు.
కాశినాయన మండలంలో అత్యధిక వర్షం
జిల్లావ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజామున పలు మండలాల్లో వర్షం కురిసింది. కాశినాయన మండలంలో అత్యధికంగా 59.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే పోరుమామిళ్లలో 50.4, దువ్వూరులో 31.4, బద్వేల్‌లో 29.2,బి.మఠంలో 28.2, పెద్దముడియంలో 27.8, రాజుపాలెంలో 24, బి. కోడూరులో 23.6 ,జమ్మలమడుగు,మైలవరంలలో 20.4,చాపాడులో 18.8, మైదుకూరులో 16.8, ప్రొద్దుటూరులో 15.8, సికెదిన్నెలో 12.6, చెన్నూరులో 11.4, ముద్దనూరులో 11.2, కడపలో 10.8, వీఎన్‌పల్లిలో 9.6, ఖాజీపేటలో 8.6, ఎర్రగుంట్లలో 8.4, అట్లూరులో 8, తొండూరు, కొండాపురంలో 7.8, పెండ్లిమర్రి, వల్లూరులో 7.4, రాజంపేటలో 7, సిద్దవటంలో 6.2, కమలాపురం, నందలూరులో 5.6, వీరబల్లిలో 3.8, ఒంటిమిట్టలో 3.6, వేంపల్లిలో 2, సింహాద్రిపురంలో 0.8 మి.మీ వర్షం కురిసింది.


