జమ్మలమడుగు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అక్కసు వెళ్లగక్కారు. ఆ రిలే నిరాహార దీక్షల్లో డీఎస్సీ అభ్యర్థులు ఎవరూ లేరని, వెంటనే ఆ దీక్షా శిబిరాన్ని తొలగించకపోతే, ఇంతకంటే పెద్ద ఎత్తున శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఆదినారాయణ రెడ్డి ఈ హెచ్చరికలు చేయడమే తరువాయి జమ్మలమడుగు సీఐ దీక్షా శిబిరానికి వచ్చి మీరు దీక్షా కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి లేదని, ట్రాపిక్‌కు ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డికి నోటీసు అందజేశారు. దీనిపై ఎమ్మెల్సీ స్పందిస్తూ తాము ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కల్పించలేదని, శాంతి యుతంగా దీక్షలు చేస్తున్నామని రాత మూలకంగా సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పోలీసులతో బెదిరించి బలవంతంగా దీక్షా శిబిరాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే రెట్టించిన ఉత్సాహంతో శాంతియుతంగా దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు,నిరుద్యోగ యువతకు భృతికింద మూడువేల రూపాయలు, డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టి నిరుపేద విద్యార్థులకు న్యాయం చెల్లిస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి వచ్చి హామీ ఇస్తే దీక్షా శిబిరాన్ని ఎత్తేస్తాం అని పేర్కొన్నారు.. నియోజకవర్గ పరిశీలకుడు పోరెడ్డి నరసింహారెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, పట్టణ ఇన్‌చార్జి ఇందిరమ్మ, జిల్లా అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జగదీశ్వరరెడ్డి, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, ముల్లాజానీ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: బషీర్: 70953 71613


