గోపవరం : గ్రామ పంచాయతీలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తాను ఒక్కడినే నిజాయితీపరుడని చెప్పుకోవడం పరిపాటిగా మారింది. వివరాలు.. మండలంలోని టీ.సండ్రపల్లె రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేస్తూ రాచాయపేట గ్రామ పంచాయతీకి గత నాలుగు నెలలుగా ఇన్‌చార్జి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలు మాత్రం ఆయనకు పట్టవు. అధికారపార్టీకి చెందిన వారికి బిల్లులు చెల్లించడంలో మాత్రం అత్యుత్సాహం చూపుతారు. గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధుల్లో తమకు బిల్లులు పెట్టాలని తాజా మాజీ సర్పంచ్ గ్రామ పంచాయతీ తీర్మానంతో రూ.5 లక్షలకు సంబంఽధించి ఎంబుక్కులు కూడా ఇన్‌చార్జి కార్యదర్శికి ఇచ్చారు. ఎంబుక్కులు ఇచ్చినప్పటి నుంచి బిల్లు పెట్టాలని ఆయన చుట్టూ తిరగని రోజంటూ లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. అన్ని గ్రామ పంచాయతీల్లో స్పెషలాఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఇక తాము ఏమి చేసినా అడిగేవారు ఉండరన్న ధోరణిలో కొందరు కార్యదర్శులు వ్యవహరిస్తున్నారు. అందులో రాచాయపేట పంచాయతీ కార్యదర్శి ఒకరు. తాను చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో కార్యదర్శి పట్టించుకోవడం లేదని స్పెషలాఫీసర్‌గా ఉన్న తహసీల్దారు జీవన్‌చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కూడా కార్యదర్శి బిల్లు పెడితే తాను అభ్యంతరం చెప్పబోనని చెప్పినట్లు తెలిసింది. కానీ మాజీ సర్పంచ్‌కు మాత్రం ఒక్క రూపాయి బిల్లు పెట్టిన దాఖలాలు లేవు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన తర్వాత అధికార పార్టీ నాయకులు చేపట్టిన పనులకు మాత్రం ఆగమేఘాల పైన బిల్లు పెట్టారని మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒకింత మాజీ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి వ్యవహారంపై అసహనానికి గురయ్యారు. తాను అధికారపార్టీకి చెందిన వాడిని కాకపోవడం, అందునా ఒక దళితుడన్న ఒకే ఒక కారణంతో తన బిల్లులు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తిస్థాయిలో గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు ఎంబుక్కులు కూడా ఉన్నాయని, ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఇదే ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేస్తున్న టీ.సండ్రపల్లెలో ఎలాంటి గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, స్పెషలాఫీసర్‌కు సమాచారం లేకుండా అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్, అతని కుటుంబీకుల సమాధుల వరకు సిమెంటు రోడ్డు నిర్మించుకున్నారు. జనసంచారం ఉన్న చోట సీసీ రోడ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా లక్షల రూపాయలు విలువ చేసే సీసీ రోడ్లను ఇలా సమాధుల చుట్టూ, వామిదొడ్ల చుట్టూ వేయడంపై స్థానికులు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ ఎంపీడీఓ హసీనాను వివరణ కోరగా రాచాయపేట మాజీ సర్పంచ్‌కు బిల్లులు అయితే చెల్లించాలని, ఇటీవల చేసిన పనులకు కార్యదర్శి బిల్లులు చేయడంపై తనకు సమాచారం లేదని తెలిపారు.


