కుల ప్రస్తావన రాకుంటే ఆట్రాసిటీ చట్టం వర్తించదా..! | - | Sakshi
Sakshi News home page

కుల ప్రస్తావన రాకుంటే ఆట్రాసిటీ చట్టం వర్తించదా..!

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

దండు వీరయ్య మాదిగ

పులివెందుల : దళిత గిరిజనులపై అగ్రవర్ణాలు దాడులు చేసిన చోట కుల ప్రస్తావన రాకుంటే అట్రాసిటీ చట్టం వర్తించదా అని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ప్రశ్నించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన ఏపీ ఎమ్మార్పీఎస్‌ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ దళిత గిరిజనులను అగ్రవర్ణాలు అవమానించి దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించిందన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఈ చట్టం 12 రకాల వివక్షతలను అప్పటి చట్టం గుర్తించిందన్నారు. 2015 నాటికి దళిత గిరిజనులు 29రకాల వివక్షతలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ సర్వేలో వెల్లడించారన్నారు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు 2015లో సవరణ చట్టం చేశారని, సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దళితులను ఏ రకంగా అవమానించిన ఉపేక్షించేదిలేదని పార్లమెంటు సాక్షిగా వెల్లడించారన్నారు. దళితులపై అగ్రవర్ణాలు అవమానించి దాడులు చేసేటప్పుడు కుల ప్రస్తావన రాకుంటే అట్రాసిటీ చట్టం వర్తించదా? అని అధికారులను ప్రశ్నించారు. అగ్రవర్ణాలు దళితులను హత్యలు, అత్యాచారాలు చేసినప్పుడు కుల ప్రస్తావన లేకుండానే కేసులు నమోదు చేయలేదా? కొందరు పోలీసు అధికారులు దళితులపై దాడి చేసినప్పుడు కులం పేరుతో దూషించలేదని కారణం చెబుతూ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా అలసత్వం వహిస్తున్నారన్నారు. నేటికీ రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దళితులకు ఆలయ ప్రవేశం లేదని, గ్రామాల్లో రచ్చబండ దగ్గర సమానంగా కూర్చున్న దాఖలాలు లేవని, దళితులకు ప్రభుత్వం ఇచ్చిన సర్వీస్‌ ఇనాం అసైన్‌న్డ్‌, ల్యాండ్‌ సీలింగ్‌ భూములను దళితేతరులు ఆక్రమణకు గురిచేసి భూములలోకి రానీయకుండా అడ్డుకుంటున్నా 1977 పీఓటీ చటాన్ని రెవెన్యూ అధికారులు సక్రమంగా అమలు చేయడంలో విఫలమవుతున్నారన్నారు. ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదులో విజ్ఞప్తులు చేస్తున్నా కాలపరిమితిలోపు సమస్యలను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, వివక్షతను రూపుమాపేందుకు ప్రతి రెండు వారాలకొకరోజు పౌర హక్కుల దినాన్ని నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డప్పు చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరిలింగగాండ్ల నాగభూషణం మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్యగారి కృష్ణమూర్తి మాదిగ. బాధితుడు పులివెందుల గంగులయ్య మాదిగ, జంజాల అరవింద మాదిగ, సుంకేసుల సుబ్బయ్య మాదిగ, శివ మాదిగ, జంజాల(ఢిల్లీ) గంగాధర మాదిగ, మడూరు నారాయణస్వామి మాదిగ, జంజాల రమాదేవి, పులివెందుల గంగులయ్య, గండు శివ మాదిగ. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement