కమలాపురం: భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నడుస్తున్నందునే వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, అలాంటి ఆ పరిశ్రమ పొరపాటున మూతపడితే వీరంతా బజారున పడతారని, సమస్యలుంటే యాజమాన్యంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నల్లలింగాయపల్లె ఎంపీటీసీ ప్రియాంక మల్లికార్జునరెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నల్లలింగాయపల్లెలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత ఐదు రోజులుగా భారతి సిమెంట్ పరిశ్రమకు మైనింగ్ జరగకుండా కొందరు అడ్డుకుంటున్నారని, ఇది సరి కాదన్నారు. సిమెంట్ పరిశ్రమతోనే పరిసర గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారని, ఒక వేళ పొరపాటున సిమెంట్ పరిశ్రమ షట్‌డౌన్ అయితే వేల మంది బజారున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఇరువర్గాల వారు చర్చిలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. బయటి నుంచి వచ్చిన ప్రజలు అలజడులు సృష్టించడం, ఆందోళనలు చేయడం వల్ల నష్టపోయేది మన గ్రామాల ప్రజలేనని, అది గ్రహించాలన్నారు. మల్లికార్జునరెడ్డి, బాల గంగిరెడ్డి, జీవీ సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడుతూ మన మంతా కలసి మెలసి సమస్యను పరిష్కరించుకుందామని, వర్గపోరు వద్దని, పరిశ్రమకు వచ్చే ముడిసరుకును అడ్డుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కొండారెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.


