కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ఈ అర్హత పరీక్ష రాయనున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో రోజుకు రెండు విడతల్లో (ఉదయం 9.30–12.00, మధ్యాహ్నం 2.30–5.00) పరీక్షలు జరగనున్నాయి. పదిహేను, ఇరవై ఏళ్లుగా బోధనలో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు కొత్త సిలబస్, కంప్యూటర్ పరీక్ష విధానం పెద్ద సవాల్‌గా మారాయి. రోజంతా పాఠశాల విధుల్లో బిజీగా గడిపి, రాత్రిపూట పుస్తకాలతో కుస్తీ పడుతూ వారు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా గేట్లు మూసివేస్తారు. హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ లేదా ఏదైనా ప్రభుత్వ ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరి. హాల్‌టికెట్‌లో ఫొటో లేని వారు రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, డిక్లరేషన్ ఇవ్వాలి. కేంద్రాల వివరాలు: కడపలో 5 కేంద్రాల్లో 9,469 మంది, ప్రొద్దుటూరులో 2 కేంద్రాల్లో 1,951 మంది, రాజంపేటలో ఒక కేంద్రంలో 369 మంది పరీక్ష రాయనున్నారు. 103 మంది దివ్యాంగులకు స్క్రైబ్స్‌ను కేటాయించారు. స్టేట్ అబ్జర్వర్‌గా పాఠ్యపుస్తకాల డైరెక్టర్ మధుసూదన్‌రావు పర్యవేక్షిస్తున్నారు. డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా కనీసం గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు
జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంకానున్న ఏపీ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) సందర్భంగా అభ్యర్థుల సౌకర్యార్థం డీఈఓ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ టెట్ పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే ఆగస్టు 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, సంప్రదించవచ్చని తెలిపారు. సందేహాలు, అత్యవసర సహాయం కోసం సహాయ సంచాలకులు 90594 09545, సూపరింటెండెంట్ 99481 21966, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ 98499 00614 నెంబర్లను సంప్రదించాలని డీఈఓ తెలిపారు.
పోలీసులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నం
– కూటమి నేతల ఆదేశాలతో మహిళపై ప్రతాపం
– పొలంలో పనులు చేయొద్దని బెదిరింపులు
సాక్షి టాస్కఫోర్స్ : మండల పరిధిలోని మాలెపాడు గ్రామంలో వ్యవసాయ పనుల్లో వరి నాట్లు వేస్తుండగా.. పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో గౌతమి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఆమెను స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధితురాలు గౌతమి మాట్లాడుతూ వ్యవసాయ పనుల్లో వరి నాట్లు వేస్తుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారని వాపోయింది. గ్రామంలోని కూటమి నేతలు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి ఆదేశాలతో జమ్మలమడుగు డీఎస్పీ సూచనల మేరకు కలమల్ల పోలీసులు వచ్చి అడ్డుకున్నారని ఆరోపించింది. పనులు చేస్తున్న కూలీలను కూడా బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. బూతులతో దర్భాష లాడటంతో అవమానం భరించలేక ఆత్యహత్యకు ప్రయత్నించినట్లు వివరించింది. తమకు న్యాయం చేయాలని ఆమె జిల్లా ఎస్పీని కోరింది. ఈ విషయంపై కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి వివరణ కోరగా.. మాలెపాడు గ్రామంలో వివాదాస్పదంగా మారిన వ్యవసాయ భూమి విషయంలో గతంలో ఘర్షణ జరిగిందన్నారు. ఆ భూమిలో ప్రస్తుతం పనులు చేస్తుండగా, ఈ భూమి వివాదాస్పదంగా ఉందని, పనులు చేయద్దని చెప్పడం జరిగిందన్నారు. వివాదాస్పదంగా ఉన్న భూమిలో పనులు చేస్తున్నారని ఎస్సీ వర్గానికి చెందిన వారు ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతోనే పనులు చేయద్దని చెప్పడం జరిగిందన్నారు.


