ఇస్రో శాస్త్రవేత్తగా సచివాలయ ఉద్యోగి | - | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తగా సచివాలయ ఉద్యోగి

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

కలసపాడు : మండలంలోని శంఖవరం గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి సి.వి.రమేష్‌కుమార్‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పరిధిలోని విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ – తిరువనంతపురం)కు శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆయన ఈ అరుదైన ఘనత సాధించారు. రమేష్‌కుమార్‌ గతంలో కలసపాడు మండలంలోని పిడుగుపల్లె, కలసపాడు సచివాలయాల్లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించారు. రైతు కుటుంబంలో పుట్టి కఠిన శ్రమ, నిరంతర కృషితో ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం సాధించడం తన జీవితంలో మరువలేని అనుభూతిని ఇచ్చిందని రమేష్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు.

జిల్లా స్థాయి ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఈనెల 10, 11 తేదీల్లో అమరావతి చాంపియన్‌షిప్‌ జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ గౌస్‌బాష తెలిపారు. ఈ ఎంపికలు 12 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంపిక చేసిన అండర్‌–19, 23 బాలబాలికలు హాజరుకావాలన్నారు. 10న డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో ఆర్చరీ, అథ్లెటిక్స్‌, హాకీ, వెయిట్‌లిప్టింగ్‌, 11న డీఎస్‌ఏ క్రీడా మైదానంలో బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, చెస్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, యోగా వంటి క్రీడా పోటీలు ఉంటాయన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఆయా తేదీల్లో పాల్గొనాలన్నారు.

కలెక్టరేట్‌ ఏఓగా నాగేశ్వరరావు

కడప సెవెన్‌రోడ్స్‌ : కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారిగా నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కడప అర్బన్‌ తహసీల్దార్‌గా ఉంటున్న నాగేశ్వరరావుకు కలెక్టరేట్‌ ఏఓ బాధ్యతలను అదనంగా అప్పగించారు.

మెరుగైన సేవలు అందించాలి

చెన్నూరు (వల్లూరు) : చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ యుగంధర్‌ సందర్శించి, ప్రయోగశాల (ల్యాబ్‌), ఫార్మసీని పరిశీలించి, అందుతున్న సేవల అమలును సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆశాదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశా అజెండా గురించి వివరించారు. అలాగే హోమ్‌–బేస్డ్‌ న్యూబోర్న్‌ కేర్‌ మరియు హోమ్‌–బేస్డ్‌ యంగ్‌ చైల్డ్‌ కేర్‌ కిట్ల ప్రాముఖ్యతను వివరించి, తల్లి–శిశు ఆరోగ్య సేవలను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ఈ కిట్లను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వినియోగించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ అధికారులు, మెడికల్‌ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా కందుల

కడప ఎడ్యుకేషన్‌ : ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్‌డ్‌ టీచర్‌ యూనియన్‌ (పీఆర్‌టీయూ) రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియన్‌ ఉపాధ్యాయులు కందుల వెంకటసుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా క్రిష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్‌లు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎన్నికై న కందుల వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ పీఆర్‌టీయూ బలోపేతంతోపాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మరింత కృషి చేస్తానన్నారు.

7న జాబ్‌మేళా

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఏపీఎస్‌ఎస్‌డీసీ, జిల్లా ఉపాఽధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 7వ తేది ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాఽధికారి అందెల సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివార్లలోని చైన్నె–హైదరాబాదు బైపాస్‌లోని ఉక్కాయపల్లెలోగల నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో నిర్వహించే ఈ జాబ్‌లో సుమారు 17 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివి 18–55 సంవత్సరాల వయస్సు మధ్యగల వారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని, అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫోటోలతో హాజరు కావాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement