● శ్రీశైలం నీరు విడుదల చేయకపోతే ప్రత్యక్ష పోరాటాలు తప్పవు
● వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం
కడప సెవెన్‌రోడ్స్ : ‘శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరకుండా, రాయలసీమ ప్రాజెక్టులకు సాగు, తాగునీరు అందించకుండా.. విద్యుత్ ఉత్పాదన పేరిట అడ్డగోలుగా నీటిని దిగువకు వదిలితే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతాం‘ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. మంగళవారం కడప లోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నేతలు చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు.
‘సీమ’వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటాలు
ఈ సమావేశంలో మాజీ మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఒక్క వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి సీమ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారని విమర్శించారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా వెయ్యి కోట్లు ఖర్చు చేసి, నిర్వాసితులకు పరిహారాలు అందించి గండికోట జలాశయంలో రికార్డు స్థాయిలో 24 టీఎంసీల నీటిని నిల్వ చేసి నిరూపించిందన్నారు. తక్షణమే శ్రీశైలం నుంచి సీమ కాల్వలకు నీటిని విడుదల చేయకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామన్నారు.
జగనన్న తెచ్చిన స్కీమ్‌పై ‘కూటమి’ డ్రామాలు
మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాష మాట్లాడుతూ.. ఎగువన జూరాల నుంచి రెండు లక్షల క్యూసె క్కుల పైబడి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం ఇప్పటికే 100 టీఎంసీలకు చేరిందన్నారు. రాయలసీమలో తాగు, సాగునీటికి తీవ్ర కటకట ఏర్పడిన నేపథ్యంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్, గోరకల్లు, అవుకు, గండికోట, కేసీ కెనాల్‌లకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో బ్రహ్మంసాగర్ నుంచి 1.5 టీఎంసీల నీటిని కడప నగర తాగునీటి అవసరాలకు నిరంతరాయంగా వినియోగించేందుకు రూ.575 కోట్ల భారీ అంచనా వ్యయంతో బృహత్తర పథకాన్ని చేపట్టి, టెండర్లు కూడా పూర్తి చేశారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులను నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు స్థానిక మున్సిపల్ ఈఈ, అధికారులు పాత పనులకే ఎమ్మెల్యే మాధవి చేత రెండోసారి భూమి పూజ చేయించడం ఆశ్చర్యకరమన్నారు. కడప నగరంలో ప్రస్తుతం తాగునీరు మూడు రోజులకు ఒకసారి కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మైలవరం జలాశయం నుంచి కడప నగర అవసరాల కోసం 200 క్యూసెక్కుల నీరు వదిలామని కూటమి నేతలు, అధికారులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
బాబు నిష్క్రియాపరత్వం వల్లే అన్యాయం
బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నిస్సిగ్గుగా అక్రమ నీటి తరలింపు చేపడుతున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. జగనన్న హయాంలో చేపట్టిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేసి ఉంటే ఈ కరువు కాలంలో 800 అడుగుల నుంచే సీమకు నీరు తీసుకునే పక్కా సౌలభ్యం ఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, నాయకుడు రమేష్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రచార విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ వినోద్‌కుమార్, చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


