చినుకు చినుకు అందెలతో..
● జిల్లావ్యాప్తంగా వాన ఊరట
● ఆరుతడి పంటలకు ‘జీవన’దానం
కడప అగ్రికల్చర్ : జిల్లాలో కరువు ముంగిట ‘చినుకు’ భరోసా లభించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షం అన్నదాతలకు కొండంత ఊరటనిచ్చింది. ఈ వాన రాకతో జిల్లావ్యాప్తంగా ఆరు మండలాల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటమే కాకుండా, ఎండిపోతున్న పంటలకు సరికొత్త జీవం పోసింది. ఈ ఏడాది ‘ఎల్‌నినో’ తీవ్ర ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక, భూగర్భ జలాలు దారుణంగా అడుగంటిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఇక వర్షాలు రావనుకున్న తరుణంలో.. ఈ వాన పడటంతో వారిలో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో సాగులో ఉన్న వేరుశనగ, కంది, మినుము, పత్తి, జొన్న, సజ్జ వంటి ఆరుతడి పంటలకు ఈ వర్షపు తేమ అమృతంలా మారిందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లభించిన వర్షపు నీటిని ఉపయోగించుకుని రైతాంగం పొలాల్లో అంతరకృషి (కలుపు తీయడం, ఎరువులు వేయడం) పనులను ముమ్మరం చేసింది.
ఆరుతడి పంటల సాగుకు ఎంతో అనుకూలం
జిల్లాలో ప్రస్తుతం కురిసిన వర్షాలు కంది, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటల సాగుకు ఎంతో అనుకూలమని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి అప్పుడప్పుడు ఇలాగే వర్షాలు కురిస్తే పంట దిగుబడులు బాగుండి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వాన మాత్రం కరవు పరిస్థితుల నడుమ నిలబడిన అన్నదాతకు కొండంత ఊరటనిచ్చిందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
బోరు బావుల పంటలకు ‘టానిక్’
జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో బోరు బావుల ఆధారంగా 7,065 హెక్టార్లలో విభిన్న ఆరుతడి పంటలను సాగు చేశారు. వీటికి బోర్ల ద్వారా నీటి తడులను అందిస్తున్నప్పటికీ.. తీవ్రమైన ఎండలు, వేడి గాలుల వల్ల ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేదు. కానీ ప్రస్తుతం కురిసిన వర్షం ఈ బోరు ఆధారిత పంటలకు కూడా ఒక రకమైన ‘టానిక్’ లాగా పనిచేయనుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో భూమి కాసింత చల్లబడటంతో ఇకపై వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్, మినుము పంటలు ఏపుగా పెరగనున్నాయి.
సరిగ్గా సమయానికి పడిన వాన
ఈ సాగైన ఆరుతడి పంటలు ఇంకో పది, పదిహేను రోజులు గడిచి ఉంటే వర్షాభావం వల్ల పూర్తిగా ఎండుముఖం పట్టే దశకు చేరుకునేవి. అలాంటి క్లిష్ట సమయంలో కురిసిన ఈ వర్షం పంటలకు నిజంగా జీవం పోసినట్లయింది. కడప మండలంలో అత్యధికంగా 34.6 ఎంఎం వర్షపాతం నమోదు కాగా.. సుండుపల్లి, పెద్దముడియం, మైలవరం, పెండ్లిమర్రి తదితర మండలాల్లోనూ పడిన వర్షం పంటల సాగుకు కొండంత అండగా నిలిచింది.


