సూపర్‌ సిక్స్‌.. ప్రజలకు సూపర్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌.. ప్రజలకు సూపర్‌ షాక్‌

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

తల్లికి వందనం ఒట్టి బూటకం

మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శ

కడప కార్పొరేషన్‌ : ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తామని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సూపర్‌ షాక్‌లు ఇస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. ఎన్నికల ముందు నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అంటూ ఇంటింటికీ వెళ్లి ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ’ పేరుతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సంతకాలతో కూడిన బాండ్లు అందజేశారన్నారు. ఇప్పుడు ఈనెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఇంటింటికీ వస్తున్నారని, ప్రజలు వారు ఇచ్చిన బాండ్లు చూపించి తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవాలని సూచించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అంటూ అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మొదటి ఏడాది ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని, రెండో ఏడాది అర కొరగా ఇచ్చారన్నారు. మూడో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 87.05 లక్షల మంది తల్లులు ఉండగా 65 లక్షల మంది తల్లులకే తల్లికి వందనం ఇచ్చారన్నారు. మిగిలిన 22.05 లక్షల మందికి ఎగనామం పెట్టారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందన్నారు. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం కూటమి ప్రభుత్వ నైజంగా మారిందన్నారు. ఇంటింటికీ టీడీపీ పేరుతో ప్రజల ఇళ్ల గడప తొక్కే ముందు, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. హామీలపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే ముందుగా ఎన్నికల హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కడప ఎమ్మెల్యే మాధవి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఎక్కడిదాకా వచ్చాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి బసవరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు మహమ్మద్‌ షఫీ, త్యాగరాజు, కే.బాబు, శ్రీరంజన్‌రెడ్డి, నార్త్‌ జోన్‌ మండల అధ్యక్షులు బీహెచ్‌ ఇలియాస్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తోట కృష్ణ, నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కంచుపాటి బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement