రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి అయిన తాళ్లపాక గ్రామంలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి చారిత్రక శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో ఉత్సవాల వేళ శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేషార్చనలు జరిపి, విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున తీర్థప్రసాదాలను అందజేశారు.సాయంత్రం వేళ అలంకృత వాహనాల్లో కామాక్షి సమేత సిద్ధేశ్వరస్వామి వారిని, శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి వారిని తాళ్లపాక మాఢవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, వేదపండితులు భక్తవత్సలం, మహేశ్, నరేష్‌లతో పాటు ఉత్సవాలకు ప్రత్యేకంగా విచ్చేసిన పలువురు వేదపారాయణ పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


