అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు? | - | Sakshi
Sakshi News home page

అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు?

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : అధికారం మాది, మమ్మల్ని అడ్డుకునేదెవరు అంటూ అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు, కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను అడ్డుకుంటే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి బాధితులనే జైలుకు పంపుతున్నారు. దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామానికి చెందిన గువ్వల కోటేశ్వరరెడ్డి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు. అతనికి సర్వే నంబర్‌ 79లో ఒక ఎకరా 76 సెంట్ల పొలం ఉండగా తెలుగు గంగ ఉప కాలువ భూసేకరణలో భాగంగా 20 సెంట్ల స్థలం కాలువకు పోయింది. వారి బంధువులు రామలింగారెడ్డి, అనసూయ, సుమలత, శివమ్మలకు పక్కనే 3.5 ఎకరాల పొలం ఉంది. వీరి పొలం పక్కనే టీడీపీకి చెందిన చిట్టిబోయిన భైరవ, బాలకృష్ణలకు పొలం ఉంది. కోటేశ్వరరెడ్డి పొలంలో నుంచి అక్రమంగా పైపులు వేసుకోవడానికి చిట్టిబోయిన భైరవ చాలా సార్లు ప్రయత్నించాడు. ఈ విషయమై కోటేశ్వరరెడ్డి చాలా సార్లు రెవెన్యూ, తెలుగుగంగ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇదే క్రమంలో గత నెల 15న కోటేశ్వరరెడ్డి పొలం నుంచి తెలుగు గంగ కాలువ నుంచి అక్రమంగా చిట్టిబోయిన భైరవ, బాలకృష్ణ పైపులు వేస్తుండగా కోటేశ్వరరెడ్డి, అతని బంధువులు అడ్డుకున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వీరి ఫిర్యాదును పోలీసులు తీసుకోకుండా స్థానిక అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే ప్రోద్బలంతో చిట్టిబోయిన భైరవ, బాలకృష్ణలకు వత్తాసు పలికారు. గువ్వల కోటేశ్వరరెడ్డి, రామలింగారెడ్డి, అనసూయ, సుమలత, శివమ్మలపై గత నెల 15న తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. ఈ విషయంపై మైదుకూరు కోర్టులో గువ్వల కోటేశ్వరరెడ్డి కేసు వేయగా ఓఎస్‌ నంబర్‌ 118/2026, 2026 అక్టోబర్‌ 7వ తేదీ వరకు కోర్టు ఇంజెక్షన్‌ ఆర్డర్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి చిట్టిబోయిన భైరవ, అతని అనుచరులు జేసీబీ, ట్రాక్టర్లతో తెలుగు గంగ కాలువను పూడ్చి గువ్వల కోటేశ్వరరెడ్డి పొలం నుంచి వారి పొలంలోకి రస్తా వేసుకున్నారు. అడ్డుకోబోయిన కోటేశ్వరరెడ్డి, వారి బంధువులను ఒక సారి మిమ్మల్ని జైలుకు పంపాం, ఈ సారి అడ్డుకుంటే మీ పరిస్థితి వేరుగా ఉంటుందని బెదిరించారని, కోటేశ్వరరెడ్డి వారి బంధువులు వాపోయారు. ఈ విషయంపై బాధితులు 100కు ఫోన్‌ చేసినా, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదన్నారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీ నేతల ఆదేశాలతో దూరం నుంచి కాపలా కాసి రోడ్డు వేయించారని బాధితులు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడి మాకు అన్యాయం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతలకు అధికారులు సహకరిస్తూ పేదవాళ్లమైన తమను బెదిరింపులకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టు ఆదేశాలను లెక్కచేయని అధికార పార్టీ నేతలు

దౌర్జన్యంగా కాలువను పూడ్చి రస్తా నిర్మాణం

డయల్‌ 100కు ఫోన్‌ చేసినా స్పందించని పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement