పరీక్షా విధానం ఇలా..
తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది
● ఆరో తరగతిలో ప్రవేశానికి
నోటిఫికేషన్ విడుదల
● ప్రణాళికాబద్ధంగా చదివితే సీటు సొంతం
● జిల్లాలోనే రాజంపేటలో
ఏకై క నవోదయ విద్యాలయం
రాజంపేట టౌన్ : జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే చాలు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. ఇదిలావుంటే వైఎస్సార్ జిల్లాలో ఒకే ఒక నవోదయ విద్యాలయం ఉంది. దాదాపు 39 సంవత్సరాల క్రితం రాజంపేట మండలం ఆకేపాడు పంచాయతీలోని నారమరాజుపల్లెలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటైయింది. ఆరవ తరగతిలో 80 సీట్లను భర్తీ చేసేందుకు ప్రతి ఏటా జిల్లాలో వేలాది మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రశ్నాపత్రం సరళి కూడా కొంత కఠినతరంగానే ఉంటుంది. ఓ ప్రణాళికాబద్దంగా ఇష్టంతో కష్టపడి చదివితే సీటు సాధించడం పెద్దకష్టం కాదంటున్నారు విద్యావేత్తలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం కొన్ని దశాబ్దాల క్రితమే దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే రాజంపేటలో నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. క్రమశిక్షణతో మెరుగైన విద్యను అందించడం జవహర్ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. ప్రస్తుతం 2027–2028 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సివుంది.
దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు వీరే..
● ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు.
● అలాగే ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదవ తరగతి తప్పనిసరిగా చదివివుండాలి.
● ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా 2026–2027 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే సీటు లభిస్తుంది.
● నోటిఫికేషన్‌లో పొందు పరిచిన విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి సీట్లు కేటాయిస్తారు.
● గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 75 శాతం, పట్టణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం సీట్ల కేటాయింపు ఉంటుంది.
● గతంలో పరీక్ష రాసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
మొత్తం నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది.
80 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మెంటల్ ఎబిలిటి (మేధాశక్తి)కి సంబంధించి 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి.
ఈవీఎస్‌కు సంబంధించి 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి.
గణితంకు సంబంధించి 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి.
తెలుగు ప్యాసేజీలకు సంబంధించి 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 31–7–2026. ప్రవేశ పరీక్ష తేదీ 28–11–2026
httpr://navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్థులు నాలుగు నెలలు ఆటలు, ఇతర వ్యాపాకాలన్నింటిని పక్కన పెట్టి సమయాన్ని వృథా చేసుకోకుండా కష్టపడి చదివితే నవోదయ విద్యాలయంలో సీటు సాధించవచ్చు. నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. టెన్త్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతటి శ్రద్ద తీసుకుంటారో అంతకన్నా ఎక్కువగా నవోదయ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని ఒక ప్రణాళికాబద్దంగా చదివిస్తే తప్పక సీటు లభిస్తుంది. నవోదయ విద్యాలయంలో విద్యార్థులు సీటు సాధించాలంటే తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. – లంకాయగారి నాగయ్య, డిప్యూటీ ఈఓ


