గేట్‌ ఫలితాల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

గేట్‌ ఫలితాల్లో సత్తా

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

వీరపునాయునిపల్లె: మండలంలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన గజ్జల బాలగంగన్నగారి గంగిరెడ్డి, చెన్నమ్మ కుమార్తె గౌరీశ్వరిదేవి గేట్‌ పరీక్షలో 793వ ర్యాంకు సాధించింది. ఈమె 10వ తరగతి వరకు మైలవరం గురుకుల పాఠశాల, కడప పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్కిక్‌ కళాశాలలో డిప్లొమా, క్రిష్ణదేవరాయ విశ్వవిద్యాయంలో బీటెక్‌ పూర్తి చేసింది. గేట్‌లో ర్యాంకు సాధించిన గౌరీశ్వరిదేవితో గురువారం సాక్షి ముచ్చటించగా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదవి మంచి ర్యాంక్‌ సాధించానని తెలిపారు. బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భైరవ ట్రాన్స్‌ఫోర్ట్‌ అధినేత మహేంద్రారెడ్డి అందించిన ఆర్థిక సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

హక్కుల సాధనకు

ఉద్యమమే మార్గం

కడప రూరల్‌ : ఉద్యోగుల హక్కుల సాధనకు ఉద్యమమే మార్గమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి. రఘురామ నాయుడు అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా వి. రఘురామ నాయుడు ఎన్నికయ్యారు. ఇటీవల కడప నగరంలో జరిగిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా రఘురామనాయుడుతోపాటు మిగతా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. తన నియామకం పట్ల రఘురామనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేష్‌ కుమార్‌ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

దాడి కేసులో వ్యక్తి అరెస్ట్‌

పులివెందుల రూరల్‌: పట్టణంలోని స్ధానిక రజక కాలనీలో మంగళవారం రాత్రి వేట కోడవళ్లతో పరస్పర దాడి ఘటనలో నిందితుడు ఓబులేసును పోలీసులు అరెస్ట్‌ చేశారు. రజక కాలనీకి చెందిన ఓబులేసు భార్య లింగమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయంలో భార్యాభర్తలు తరుచూ గొడవ పడుతున్నారు. అదే కాలనీకి రవి, మునికాంతమ్మ దంపతులు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించగా.. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ కేసులో గురువారం ఓబులేసును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా సీఐ శ్రీరామ్‌ మాట్లాడుతూ పార్నపల్లె రింగ్‌ రోడ్డు సమీపంలో సంచరిస్తున్న ఓబులేసును అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ శ్రీరామ్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు తిమోతి, మధుసూదన్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

విజిలెన్స్‌ దాడులు

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మైదుకూరు రోడ్డులో నిర్వహిస్తున్న మసాలా పొడుల ఫ్యాక్టరీపై విజిలెన్స్‌ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ ఫ్యాక్టరీలో నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజలెన్స్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేశారు. సుమారు 1500 కిలోల పైగా మసాలా పొడులను అధికారులు సీజ్‌ చేశారు. వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు. ల్యాబ్‌లో వచ్చే రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఫ్యాక్టరీకి ఒక చోట అనుమతి తీసుకొని మరో చోట నిర్వహిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

విద్యుత్‌ మోటార్ల వైర్లు కట్‌

ఖాజీపేట : విద్యుత్‌ మోటార్ల వైర్లను దుండగులు కట్‌ చేశారు. తుడుమలదిన్నె గ్రామంలో గురువారం ఐదు మోటర్ల విద్యత్‌ వైర్లను దొంగలు కట్‌ చేశారు. పంటకు నీళ్లు పెట్టేందుకు మోటర్‌ను ఆన్‌ చేసేందుకు వెళ్లిన రైతులకు విద్యుత్‌ తీగలు కట్‌ అయిన విషయం తెలుసుకొని ఖాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాగే విద్యుత్‌ తీగలు కట్‌ చేశారని తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేయాలని రైతులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement