లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన అంజనప్పగారి నారాయణ (75) బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. అంజనప్పగారి నారాయణ వారం రోజుల క్రితం భార్యతో ఘర్షణ పడి ఇంటికి రాకుండా బయట తిరుగుతుండేవాడు. మూడు రోజుల క్రితం పార్నపల్లె గ్రామ సమీపంలోని మెటిక కోనలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ మేకల కాపరులు ఆయన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి అంజనప్పగారి నారాయణ మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
కుక్కల దాడిలో జింక మృతి
ముద్దనూరు: స్థానిక ఫారెస్టు రేంజి పరిధిలోని పెద్దకొమెర్ల గ్రామంలో గురువారం జింకపై కుక్కలు దాడిచేసి తీవ్రగా గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన జింకను స్థానిక డీఆర్వో శ్రీనివాసులు సిబ్బందితో కలిసి వెళ్లి స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఆర్వో కార్యాలయానికి తరలిస్తుండగా మార్గమధ్యలో జింక మృతి చెందిందని డీఆర్వో తెలిపారు. జింకకు పోస్టుమార్టం నిర్వహించి ఎఫ్‌ఆర్వో ఓబులేసు ఆదేశాల మేరకు దహనం చేసినట్లు డీఆర్వో పేర్కొన్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
మైలవరం: మండల పరిధిలోని చిన్న కొమెర్ల గ్రామానికి చెందిన కర్నాటి లక్ష్మీనారాయణమ్మను (35) గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గురువారం ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తలమంచిపట్నం ఎస్‌ఐ హైమావతి వివరాలు మేరకు.. లక్ష్మీనారాయణమ్మ గడ్డి మోపు ఎత్తుకు ని ఇంటికి వస్తుండగా ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు ఆమె భర్త భాస్కర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. రూరల్ సీఐ కులాయప్ప సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.


