ప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారులోని జమ్మలమడుగు బైపాస్‌రోడ్డు పక్కన ఉన్న ఐఓసీఎల్ పెట్రోల్ బంకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలియడంతో గురువారం సాయంత్రం రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి సుమారు 50–55 ఏళ్లు ఉంటాయని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి గురించి ఎస్‌ఐ స్థానికులను విచారించినా అతను ఎవరనే విషయాలు తెలియలేదు. అనారోగ్యం కారణంగా అతను మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే రూరల్ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
అట్లూరు : మండల పరిధిలోని లింగాలకుంట చెరువు దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు కడప నగరం భగత్ సింగ్ నగర్‌కు చెందిన మోహన్, మాసాపేటకు చెందిన శ్రీను ఇరువురు ద్విచక్రవాహనంపై నెల్లూరు జిల్లా కలువాయికి వెళ్లి పనులు ముగించుకుని తిరిగి కడపకు వస్తూ అట్లూరు మండలం లింగాలకుంట చెరువు మలుపు వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డారు. వీరిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


