రాజంపేట : పట్టణంలోని నూనివారిపల్లెలో నివసిస్తున్న సింగనమల శిరీషపై భర్త తమ్ముడు సింగనమల శ్రీను దాడి చేసినట్లు గురువారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సింగనమల శిరీష, రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అత్తగారింటిలో ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు తలెత్తాయి. దీంతో భర్త నూనివారిపల్లెలో ఇల్లు తీసుకొని, తన భార్యను అక్కడి పెట్టి, కువైట్‌కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మరిది ఆసరా తీసుకొని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడన్నారు. దీంతో మరిది వదినపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన ఆమెను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు కడప రిమ్స్‌కు రెఫర్ చేశారు. రిమ్స్‌లో చికిత్స తీసుకొని, నేరుగా రాజంపేట అర్బన్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. మీడియా ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వివరించారు. తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


