ఒంటిమిట్టలో ఆక్రమణల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టలో ఆక్రమణల తొలగింపు

Mar 20 2026 8:11 AM | Updated on Mar 20 2026 8:11 AM

అధికారులను అడ్డుకున్న దుకాణాదారులు

ఘర్షణ పడ్డ ఆక్రమణదారులు

ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆనుకుని వెనుక వైపు ఉన్న 1500/1బీ సర్వే నంబర్‌లో ఒంటిమిట్ట పంచాయతీకి చెందిన ఎంతో విలువైన గ్రామ కంఠాన్ని కొంత మంది కొన్నేళ్లుగా ఆక్రమించుకుని దుకాణాల పేరుతో ధనార్జన చేస్తున్నారు. వారిని చూసి మరి కొంత మంది ఈ మధ్య కాలంలో ఆక్రమణ చేసి, ముగ్గులు, రేకుల షెడ్లు, టెంట్లు వేసుకున్నారు. దీనిపై కొంత మంది మండల ప్రజా పరిషత్‌, పంచాయతీల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవోపీఆర్‌డీ చలపతి, ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి టి.కిశోర్‌ కుమార్‌ పోలీసు బందోబస్తుతో వచ్చి ఆక్రమణలను తొలగించడం మొదలు పెట్టారు. అయితే ఇది జరుగుతుండగా ఆక్రమణలు చేసిన ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని, ఘర్షణకు దారి తీసింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై సిమెంటు ఇటుకతో దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరికి రక్త గాయాలు అయ్యాయి. బాధితుడిని కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఘర్షణ అనంతరం ఆక్రమణల తొలగింపు మళ్లీ పుంజుకుంది. ఈ క్రమంలో ఆరు ఆక్రమణలను తొలగించి, మిగిలిన అక్రమ దుకాణాలను తొలగించబోతున్న ఈవోపీఆర్‌డీ చలపతి, ఇన్‌చార్జ్‌ పంచాయతీ కార్యదర్శిని అక్రమంగా దుకాణాలు నడుపుతున్న వ్యాపారస్తులు అడ్డుకున్నారు. తొలగిస్తే అన్ని దుకాణాలను తొలగించాలని, లేకుంటే ఇక్కడి నుంచి తాము దుకాణాలను తొలగించుటకు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. దీంతో 1500/1బీ సర్వే నంబర్‌లోని పంచాయతీ గ్రామకంఠంలో గత కొన్ని ఏళ్లుగా ఆక్రమణ చేసి, దుకాణాలను నడుపుతున్న వారందరి ఆక్రమణలను తప్పకుండా తొలగిస్తామని, ఈ నెల 21 వరకు దుకాణాదారులకు గడువు ఇవ్వడం జరిగిందని, ఆ లోపు వారే స్వచ్ఛందంగా తొలగించుకుంటే సరిపోతుందని, లేకుంటే తామే జేసీబీ సాయంతో తొలగించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. తాము చెప్పిన సమయానికి దుకాణాలను తొలగించకుంటే అధికారులే తొలగించుకోవచ్చునని, ఇది వరకు దుకాణాదారులు తాము ఇచ్చిన నోటీసులలో సంతకాలు కూడా చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement