సాక్షి, అన్నమయ్య: చేనేత మగ్గాల సప్పుడు వినిపించే ఒక సామాన్య గ్రామం నుంచి వచ్చిన యువతి, నేడు అంతర్జాతీయ స్థాయిలో రైల్వే వ్యవస్థను శాసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మెట్రో రైలు నడిపిన తొలి మహిళా పైలెట్‌గా గోవిందు గ్రీష్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన చేనేత కుటుంబంలో గ్రీష్మ జన్మించారు. తండ్రి గోవిందు శంకర్ రావు, తల్లి నాగ శారద. గ్రీష్మ ప్రాథమిక విద్య వేపరాలలోని జెడ్పీ హైస్కూల్‌లో సాగింది. అనంతరం కడపలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా, ఆ తర్వాత కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండే ఆమె, ఇంజనీరింగ్ చివరి ఏడాదిలోనే క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం సాధించి తన ప్రతిభను చాటారు.
ప్రధాని మోదీ ప్రశంసలు..
2015లో లోకో పైలెట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గ్రీష్మ కెరీర్‌లో నవంబర్ 28, 2017 ఒక చిరస్మరణీయమైన రోజు. హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో కూడిన ప్రత్యేక ట్రయల్ రన్ రైలుకు గ్రీష్మ లోకో పైలెట్‌గా వ్యవహరించారు. దేశాధినేత ప్రయాణిస్తున్న రైలును నడిపి, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఆదర్శంగా ’గ్రీష్మ’ ప్రస్థానం
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న గ్రీష్మ, ఏపీ నుంచి ఈ రంగానికి వచ్చిన తొలి మహిళా పైలెట్. సాధారణంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఈ వృత్తిలోకి మహిళలు వస్తున్నా, ఏపీ నుంచి ఒంటరిగా పోరాడి ఈ స్థాయికి చేరడం విశేషం. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా రాణించాలని ఆకాంక్షిస్తూ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.


