ప్రొద్దుటూరు (క్రైమ్): రోగుల సేవలో అలసట ఎరుగని నర్సుగా.. బరువులు ఎత్తడంలో తిరుగులేని అథ్లెట్‌గా ద్వంద్వ పాత్రల్లో సత్తా చాటుతున్నారు బోడెద్దుల మానస. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఆమె, అటు వృత్తిలో ఇటు క్రీడల్లో మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తున్నారు.
వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు మునిస్వామి కుమా ర్తె మానస. చిన్నప్పటి నుంచే క్రీడలంటే మక్కువ ఉన్న ఈమె, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 2020లో స్టాఫ్ నర్సుగా కొలువు సాధించారు. స్నేహితురాలి ప్రోత్సాహంతో సరదాగా వెయిట్ లిఫ్టింగ్‌లోకి అడుగుపెట్టిన మానస, మొదటి ప్రయత్నంలోనే అద్భుత ప్రతిభ చాటారు. ‘ఆడపిల్లలకు వెయిట్ లిఫ్టింగ్ ఏంటి? ఎముకలు విరుగుతాయి‘ అంటూ కొందరు నిరుత్సాహపరిచినా, కుటుంబ సభ్యులను భయపెట్టినా ఆమె వెనకడుగు వేయలేదు. తనను విమర్శించిన వారే నోరెళ్లబెట్టేలా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండించారు. రోగులకు మందులు వేసే సున్నితమైన చేతులతోనే, క్లిష్టమైన ఇనుప బరువులను ఎత్తుతూ ’మహిళా శక్తి’ని చాటిచెప్పారు. అడ్డంకులను ఆయుధాలుగా మార్చుకున్న మానస ప్రస్థానం, పట్టుదల ఉంటే ఏ విమర్శనైనా పతకంతో సమాధానం చెప్పవచ్చని నిరూపిస్తోంది.
కీలక విజయాలు:
జాతీయ స్థాయి: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీల్లో (52 కిలోల విభాగం) వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, డెడ్ లిఫ్ట్ అంశాలలో రెండు బంగారు పతకాలు సాధించి సత్తా చాటారు.
రాష్ట్ర స్థాయి: రెండు స్వర్ణ పతకాలతో పాటు వివిధ అథ్లెటిక్ పోటీల్లో ఇప్పటివరకు 20కి పైగా మెడల్స్ తన ఖాతాలో వేసుకున్నారు.
స్ట్రాంగ్ ఉమెన్ ట్రోఫీ: 2024 ఫిబ్రవరిలో కర్నూలులో జరిగిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.


