కాపుకాచి.. ప్రయాణికులను ఏమార్చి..
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లాలో బస్సులు, బస్టాండ్‌లు, ఆటోలలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని బ్యాగుల్లోని నగలు, నగదు చోరీకి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భారీగా దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అరెస్టయిన నిందితుల నుంచి సుమారు రూ. 75 లక్షల విలువైన 507 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కిలో వెండి ఆభరణాలు, రూ.61వేలు నగదు, సుమారు రూ. 4లక్షల విలువైన కారు, నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, టి.నగర్‌కు చెందిన తొండా పోసమ్మ, ఆమె భర్త పోతురాజు, డ్రైవర్లకాలనీలో నివసిస్తున్న రావుల లక్ష్మి, పులివెందులకు చెందిన కవీటి అరుణ, పిఠాపురం మండలం, రాజుగారికుంటకు చెందిన పాల శ్రీకాంత్, అతని భార్య పాల సుమతి, వీరి కుమారుడు పాల వంశీ, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం నందివీధికి చెందిన నాగళ్ల శివకుమార్, మరో యువకుడు పాల ప్రేమ్‌కుమార్ ఉన్నారని వివరించారు.
చోరీలు చేశారిలా..
ఈ ముఠా సభ్యులు బస్సులు, ఆటోల్లో ప్రయాణికుల్లా ఇతరులతో కలిసిపోతారు. ఒకరు టికెట్ తీసుకున్నట్టు నటించడం, మరొకరు మాటలతో దృష్టి మళ్లించి ప్రయాణికులను ఏమరుపాటుకు గురిచేస్తారు. ఆపై బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, పర్సులు, బాక్సులు దొంగిలిస్తారు. అనంతరం, మధ్యలో దిగిపోయి, వెనుక వస్తున్న తమ కారులో ఎక్కి, అనుమానం రాకుండా గుడుల వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకునే పద్ధతిని అనుసరిస్తారని పోలీసులు వెల్లడించారు.
ఈ గ్యాంగ్ నేరాలు చేసిన ప్రదేశాలు..
ఎరగ్రుంట్ల, ముద్దనూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, పులివెందుల, తాడిపత్రి, మద్దిమడుగు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ ముఠా బ్యాగ్ లిఫ్టింగ్‌లకు పాల్పడింది. వీరు దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని తమ ప్రాంతాల్లో పరిచయాల ద్వారా అమ్మడం, తాకట్టు పెట్టడం చేస్తుంటారు. మిగిలిన బంగారాన్ని తమ వద్దే దాచుకుంటారు. ఈ క్రమంలో నేరస్థులు దొంగిలించిన బంగారంలో కొంత భాగం రాజమండ్రిలోని జెట్టి జ్యువెలర్స్ షాపులో తాకట్టు పెట్టినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ ముఠాపై జిల్లాలో మొత్తం 23 కేసులు ఛేదించామని ఎస్పీ తెలిపారు. గత పదేళ్లలో గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, నంద్యాల, తూర్పుగోదావరి, కాకినాడ, బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, రాజమహేంద్రవరం, అనంతపురం తదితర జిల్లాల్లో అనేక కేసులు నమోదయ్యాయి.
పదేపదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌లను నమోదు చేయిస్తాం: ఎస్పీ
జిల్లాలో ఎవరైనా పదేపదే నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్‌లను నమోదు చేయించి చట్టపరంగా చర్య లు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హె చ్చరించారు. ఈ ముఠాలో అత్యధికంగా పోసమ్మపై 15 కేసులు, ఆమె భర్త పోతురాజుపై 42 కేసులు, రావుల లక్ష్మిపై 10 కేసులు నమోదై వున్నాయి. వీరిపై పీడీ యాక్ట్‌లను నమోదు చేస్తామన్నారు. జిల్లాలో జరుగుతున్న బ్యాగ్ లిఫ్టింగ్ ఘటనలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన జమ్మలమడుగు పోలీసులు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ముద్దనూరు– కడప మెయిన్‌రోడ్డులో కాపు కాసి వలసపల్లె క్రాస్ వద్ద అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తులో కృషిచేసిన సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ నాగమురళితో పాటు ఏఎస్‌ఐ కె.రాజారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ ఆల్‌ఫ్రె డ్, కానిస్టేబుళ్లు లక్ష్మినారాయణ, ఏ. శివ ప్రసాద్, వీర పోతులూరయ్య, ఎ. మునీంద్ర, రామచంద్ర, ఆర్. చంద్ర, మహిళా కానిస్టేబుల్ జయంతి, హోంగార్డు ఎస్.వలీ, మహిళా హోంగార్డులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్ రాష్ట్ర బ్యాగ్ లిఫ్టింగ్ ముఠా అరెస్టు
రూ.75 లక్షల బంగారు, వెండి నగలు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న వాటిలో
507 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కిలో వెండి, రూ. 4 లక్షల విలువైన కారు, రూ. 61,000 నగదు, మొబైల్ ఫోన్లు
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


