సమర్థవంతమైన పనితీరు.. మెరుగైన పోలీసింగ్
కడప అర్బన్ : జిల్లాలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2025లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వల్లనే సాధ్యమైందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌థ్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో 2025 నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విగుణీకృత ఉత్సాహంతో 2026లో మరింత మెరుగైన పోలీసింగ్‌తో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తామన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2025లో అన్ని రకాలైన నేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపించిందన్నారు. జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల నిరంతర నిఘా, కఠిన చర్యలతో ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైందన్నారు.
మహిళా భద్రతపై స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని మహిళల రక్షణకు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, మహిళల భద్రతకు ఉన్న చట్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు 3079 చేపట్టామన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పాఠశాలలు, కళాశాలల్లో 1290 అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదంతో పోలీస్ కళాజాగృతి బృందం ద్వారా నాటక ప్రదర్శనలు ఇప్పించామన్నారు. అదేవిధంగా శక్తియాప్ పై అవగాహన కల్పించి 27,805 మంది చేత శక్తియాప్ రిజిస్ట్రేషన్ చేయించామన్నారు.
గణనీయంగా నేరాలు తగ్గుదల..
విజిబుల్ పోలీసింగ్, అసాంఘిక శక్తులపైనా నిఘా, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, పి.డి. యాక్ట్ ప్రయోగం, నాటుసారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపడం, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించడం, గంజాయి పైన కట్టడి వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ వివరించారు.
ప్రాపర్టీ నేరాల కేసుల్లో..
● 2025లో మొత్తం 575 ప్రాపర్టీ నేరాల కేసులు నమోదు కాగా, 330 కేసులు (57.39 శాతం) ఛేదించి పోగొట్టుకున్న సొత్తు రూ. 8,59,60,862 మొత్తంలో రూ. 4.15 కోట్ల (48.31 శాతం) విలువైన చోరి సొత్తు రికవరీ చేశామని తెలిపారు.
● జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి దాడులు నిర్వహించి 767 కేసులు నమోదు చేసి 3473 మందిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుండి రూ.1,65,57,268 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
● జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టి 2025 సంవత్సరంలో 9 కే సులు నమోదు చేసి 55 మందిని అరెస్టు చేశామ న్నారు. 1979 కిలోల బరువున్న 139 దుంగలను, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
● గంజాయి విక్రయాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించి 22 కేసులు నమోదు చేసి 67 మందిని అరెస్టు చేశామన్నారు. 46.27 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాద మరణాలలో స్వల్ప పెరుగుదల..
జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం, డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం చేసినప్పటికీ రోడ్డు ప్రమాద మరణాల్లో గత ఏడాదితో పోల్చితే స్వల్ప శాతం పెరుగుదల నమోదైందన్నారు.
ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు..
విద్యార్థులు, డ్రైవర్లు తదితరులకు 3,100 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించామన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు 760 స్టాప్ – వాష్ – గో కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
● నమోదైన 57 సైబర్ నేర కేసులలో 33 కేసులు ఛేదించి, 62 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. బాధితులు కోల్పోయిన మొత్తం రూ. 16.47 కోట్లలో రూ. 21.52 లక్షలు బాధితులకు తిరిగి చెల్లించామన్నారు.
● ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ ఏడాది మొత్తం 9,704 ఫిర్యాదులలో 9,300 ఫిర్యాదులు నిర్ణీత గడువులోనే పరిష్కారమయ్యాయన్నారు.
గండికోటలో బాలిక వైష్ణవి హత్య కేసు పురోగతిపై ప్రశ్నించగా... బాలిక వైష్ణవి కేసులో దర్యాప్తు పురోగతిలో భాగంగా ఫోరెన్సిక్‌కు సంబంధించిన మెటీరియల్‌ను పరీక్షల కోసం ముంబైలోని సెంట్రల్ ల్యాబ్‌కు పంపించామని బదులిచ్చారు. ప్రొద్దుటూరులో కిడ్నాప్ కేసు దర్యాప్తులో ఓ వ్యక్తి గురించి అడుగగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, ఎస్‌బీ డీఎస్పీ ఎన్.సుధాకర్ పాల్గొన్నారు.
2025 నేర సమీక్షలో జిల్లా ఎస్పీ
షెల్కే నచికేత్ విశ్వనాథ్


