రాతపై పట్టు.. మార్కులు రాబట్టు
● చేతిరాత పరీక్షల్లో ‘కీ’లకం
● టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఆసన్నమైన సమయం
● విద్యార్థులు దస్తూరిపై సాధన
చేయాలంటున్న నిపుణులు
● ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాతపై సాధన చేయిస్తున్న ఉపాధ్యాయులు
రాజంపేట టౌన్ : టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు టైమ్‌టేబుల్ కూడా వచ్చేసింది. అత్యుత్తమ మార్కులు సాధించి మంచి గ్రేడింగ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో అనేక మంది విద్యార్థులు ఓ ప్రణాళికను సైతం రూపొందించుకొని చదవడం ప్రారంభించారు. అయితే ఏడాది పాటు చదివిన విషయాలను జవాబు పత్రంపై రాసే విధానం వల్ల కూడా మార్కులు, గ్రేడింగ్ పాయింట్లు ఆధారపడి ఉంటాయి. అయితే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించే విద్యార్థులు తక్కువ మంది మాత్రమే ఉంటారు. విద్యార్థులు పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఎంత ముఖ్యమో చేతిరాత కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చేతిరాత నిపుణులు సూచిస్తున్నారు. చేతిరాత బాగుంటే మూల్యాంకనం చేసే వారికి సులువుగా అర్థమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతిరాత బాగాలేకపోతే మూల్యాంకనం చేసే వారికి సమాధానం అర్థం కాకుంటే ఒకమార్కు లేదా అర్ధ మార్కు అయినా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది గ్రేడింగ్ పాయింట్స్‌పై ప్రభావం చూపే అవకాశముంది. అందువల్ల విద్యార్థులు చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు రెండు నెలలలోపే సమయం ఉండగా, టెన్త్ పరీక్షలకు రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు రోజుకు అర్ధగంట అయినా చేతిరాతపై సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో చేతిరాత ఎలా ఉండాలో నిపుణుల మాటల్లోనే..
● ప్రతి విద్యార్థి ఆన్సర్‌షీట్ (బుక్‌లెట్)లో సమాధానాలను స్పష్టంగా రాయాలి.
● నాలుగు వైపులా మార్జిన్లు (బార్డర్లు) వేసుకుంటే చూసేందుకు అందంగా ఉంటుంది.
● ఒక లైనుకు మరో లైనుకు సెంటీమీటర్ గ్యాప్ ఇవ్వాలి.
● పదానికి, పదానికి తగనంత (ఒకటి లేదా రెండు అక్షరాల) స్పేస్ ఇవ్వాలి.
● బుక్‌లెట్‌లో వాక్యాలు పైకి కిందకు లేకుండా వరుస క్రమంలో ఉండాలి.
● కంటికి, పేపరుకు 30–35 సెంటిమీటర్ల దూరం ఉండాలి.
● బొటన వేలు, మూడవ వేలికి మధ్య చూపుడు వేలు సహాయంతో పెన్నును చక్కగా పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రాసే సమయంలో పెన్ను స్పీడుగా ముందుకు కదులుతుంది.
● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది.
● మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది.


