ఐటీఐ పరీక్షలు రాసేందుకు ప్రైవేటు అభ్యర్థులకు అవకాశం
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో 2026 సంవత్సరంలో జరగనున్న ఐటీఐ పరీక్షలు రాసేందుకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ ఐటీఐ విద్యార్హత పొందేందుకు అర్హత, అనుభవం గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ మైనారీటీ ఐటీఐ ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. అభ్యర్థులు తప్పని సరిగా 21 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలన్నారు. సంబంధిత ట్రేడ్‌కు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలన్నారు. లేదా ఎంఎస్‌ఎంఈ గుర్తింపు కలిగి ఉండాలన్నారు. కనీస విద్యార్హతగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఏ ప్రభుత్వ ఐటీఐనైనా సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తు చేసేందుకు 2026 జనవరి 28వ తేదీ చివరి గడువని తెలిపారు.
బాలనర్తకి కేతనరెడ్డికి అవార్డు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్) : కూచిపూడి నృత్యంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మద్దిరాల కేతనరెడ్డికి ‘నవ తెలుగు తేజం – శ్రీ లలిత శ్రావంతి అవార్డు దక్కింది. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మద్దిరాల కేతనరెడ్డి కూచిపూడి ప్రదర్శనలో అబ్బురపరుస్తోంది. కేతన ఇప్పటికే భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రపంచంలో సత్తా చాటింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకోవడం తన భవిష్యత్ లక్ష్యమని కేతనరెడ్డి తెలిపింది.
మహిళా మార్ట్‌లో చేతివాటం
వాల్మీకిపురం : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఉపాధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మహిళా మార్టును ఏర్పాటు చేశారు. అయితే వాల్మీకిపురంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌లో వెలుగు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో నష్టాల బాట పట్టి మూసివేతకు సిద్ధంగా ఉన్నట్లు పలు విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది చేతివాటం వల్లనే మార్టు నష్టాల బాట పట్టిందని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిపై శనివారం మహిళా డీపీఎం వెంకటరమణ మార్టులో తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. విచారణ చేపట్టి, అక్రమాలు జరిగి ఉంటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చైన్ స్నాచర్ అరెస్టు
కలికిరి : వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ కేసులో కర్నాటక రాష్ట్రం బెంగళూరు డీజే హళ్ళి ఏరియా మోదీ రోడ్డుకు చెందిన ఫైరోజ్‌ను కలికిరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... కలికిరి పట్టణం క్రాస్ రోడ్డు చదివేవాండ్లపల్లిలో వృద్ధురాలు అరుణకుమారి ఒంటరిగా ఉంటోంది. ఈమె పిల్లలు ఉద్యోగ రీత్యా హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంటున్నారు. ఒంటరిగా ఉన్న ఆమె మెడలో వేసుకున్న బంగారు చైనుపై పక్కింటిలో నివాసం ఉంటున్న అబ్దుల్లా కన్ను పడింది. బెంగళూరులో వుంటున్న తన స్నేహితుడు ఫైరోజ్‌ను ఈ నెల 6న కలికిరికి పిలిపించాడు. ఇల్లు బాడుగకు కావాలని వృద్ధురాలిని మాటల్లో దింపిన ఫైరోజ్ చాకచక్యంగా ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ పీవీ రమణ దర్యాప్తు చేపట్టారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, కలికిరి సీఐ రామచంద్ర సాంకేతికత సాయంతో నిందితుడు కర్నాటకు చెందిన ఫైరోజ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.


