ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ప్రజా రవాణాధికారి (డీపీటీఓ) ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కడప పర్యటనలో భాగంగా ఆయన ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. అనంతరం వై.జంక్షన్ నుంచి దీక్షా శిబిరం వరకు ర్యాలీగా వచ్చి దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు డీపీటీఓ తీరుతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్నారు. ప్రతి చిన్న అంశానికి సస్పెన్షన్లు, ఛార్జిషీట్లు, పనిష్‌మెంట్ల విధానాన్ని అమలు చేయడం దారుణమన్నారు. డీపీటీఓ వ్యవహారంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా పదోన్నతుల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ముందుగానే డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉండగా, ఉన్న కార్మికులను నెలల తరబడి విధులకు దూరంగా ఉంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీ శివారెడ్డి, శ్రీనివాసరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజేష్‌కుమార్, పీఎస్‌ఎన్ రావు, జోనల్‌లోని వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లాలోని ఆరు డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, గ్యారేజీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పాణ్యం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప నగరానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా పాత కడపకు చెందిన నాగార్జున రెడ్డి, పద్మావతి దంపతుల కుమారుడు అవినాష్‌రెడ్డి(22) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సొంతూరుకు వచ్చిన అవినాష్‌రెడ్డి పనులు ముగించుకు శనివారం కారులో తల్లితో కలసి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో పాణ్యం సమీపంలోని నూలుమిల్లు వద్దకు రాగానే మలుపు వద్ద కారు అదుపు కాక సూచిక బోర్డును ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108లో నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అవినాష్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద సమయంలో కారులో రెండు ఎయిర్ బెలూన్‌లు తెరుచుకోవడంతో పద్మావతి గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి


