ముందస్తు నోటీసులు లేకుండా బండ చప్పట ధ్వంసం
చాపాడు : తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇంటి వద్ద ఉన్న బండ చప్పటను జేసీబీ పెట్టి టీడీపీ నాయకులు అక్రమంగా తొలగించారని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చందా పార్వతి, భర్త చందా రామసుబ్బారెడ్డి(అబ్బిరెడ్డి) వాపోయారు. మండలంలోని బద్రిపల్లె గ్రామంలో శనివారం సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం మాజీ సర్పంచ్ చందా పార్వతి ఇంటి ముందు ఉండే బండ చప్పటను తొలగింపజేశారు. బండ చప్పటను జేసీబీతో తొలగించే క్రమంలో చందా రామసుబ్బారెడ్డి కుటుంబీకులు అభ్యంతరం చెప్పగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బద్రిపల్లె ఊరంతా గ్రామ కంఠంలో ఉందని, పూర్వీకుల నుంచి గ్రామంలో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారన్నారు. ఈ క్రమంలో తమ దాయాదుల ఇళ్లకు రాకపోకల కోసం స్థలం ఏర్పాటు చేసుకుని బండ చప్పట వేసుకున్నామన్నారు. పదేళ్ల క్రితం తమ ఇళ్ల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించగా తాము అడ్డుకున్నామని తెలిపారు. ఈ సమయంలో కోర్టుకెళ్లగా రోడ్డు నిర్మాణ పనులు జరుగలేదన్నారు. ఈ క్రమంలో శనివారరం టీడీపీ నాయకుడు నారాయణ పోలీసులను వెంట బెట్టుకుని వచ్చి జేసీబీతో తమ ఇంటి ముందున్న బండ చప్పటను ధ్వంసం చేయించాడన్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామ ని రామసుబ్బారెడ్డి కుటుంబీకులు తెలిపారు.


