శాసీ్త్రయ పద్ధతిలో వ్యవసాయం మేలు
మైదుకూరు : శాసీ్త్రయ పద్ధతిలో వ్యవసాయం ఎంతో మేలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి.గోపికృష్ణ తెలిపారు. కడప ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా మండలంలోని అన్నలూరులో ఎల్‌ఆర్‌జీ 454 రకం కంది పంట చిరు సంచుల ప్రదర్శన పొలాలను పరిశీలించారు. కంది పంట పెరుగుదల, మొక్కల ఆరోగ్యం, పువ్వుల దశ, గింజల ఏర్పాటుతోపాటు వ్యాధి పురుగు శత్రువుల ప్రభావం తదితర అంశాలను గమనించారు. కొత్త రకమైన ఎల్‌ఆర్‌జీ 454 పంటలో మొక్కల సమానమైన పెరుగుదల, ఎక్కువ పళ్ల సంఖ్య, గింజల నింపుదల మంచి స్థాయిలో ఉండటం సానుకూల సంకేతమని శాస్త్రవేత్త గోపికృష్ణ అన్నారు. అనంతరం గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం కింద అన్నలూరులో శిక్షణ పొందుతున్న ఉదయగిరి ఎస్‌ఎంజీఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థుల కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. విద్యార్థులు రైతులకు అందిస్తున్న విస్తరణ సేవలు, పంట పరిరక్షణ సలహాలు, సాంకేతిక మార్గదర్శకాలు, రికార్డు నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణప్రియ పాల్గొన్నారు.


